ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే.. ఓనర్ కాదు.. అమ్మే హక్కు లేదు

ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే.. ఓనర్ కాదు.. అమ్మే హక్కు లేదు
  • ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: ప్రజలకు, ప్రజల ఆస్తుల సంబంధించిన సామూహిక ఆస్తులకు ప్రభుత్వం ట్రస్టీ మాత్రమేనని.. ఓనర్ కాదని.. ప్రజల ఆస్తులు అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మంగళవారం గాంధీ భవన్ నుంచి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు ట్రస్టీ లు మాత్రమే, ఓనర్లు కాదు. ఆస్తులను కాపాడాలి కానీ అమ్ముకోవద్దని తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం చేస్తున్న జల్సాలకు తెలంగాణ ఆస్తులను తెగ నమ్ముతున్నారని దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో దివాళా కోరు పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. 30 శాతం ఆదాయం ఉన్న హైదరాబాద్, ఏడేళ్ల క్రితం తెలంగాణ వచ్చిన సమయంలో ఒక ధనిక రాష్ట్రంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 60 వేల కోట్ల అప్పు ఉన్న తెలంగాణకు ఇప్పుడు 4 లక్షల కోట్ల ఆప్పు అయ్యిందని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 60 వేల కోట్ల అప్పు అయితే ఇపుడు 7 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేశారని ఆయన విమర్శించారు. 
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ధర్నా చేశాం
2012లో ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములు అమ్ముతుంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ నేతృత్వంలో ధర్నా చేశామని దాసోజు శ్రవణ్ గుర్తు చేసుకున్నారు. 2012 లో ప్రభుత్వ భూములు అమ్మొద్దని ఉద్యమం చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎలా అమ్ముతున్నదని ఆయన నిలదీశారు. ఇప్పుడు భూములు అమ్ముతామంటే అప్పుడు తప్పు చేశామని చెంపలు వేసుకోవాలని ఆయన సూచించారు. మంత్రి హరీష్ రావు భూములు ఎందుకు అమ్మరాదని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల ప్రభుత్వ భూమిని పేదలకు పంచారు. మరి మీరు ఇప్పుడు ఎంత పంచారో చెవుతారా ? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గీ మాత్రం దానికి మీరు పాలించడం ఎందుకు.. ఒక పనికిరాని పాలన జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. 
18 లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలి
తెలంగాణ నుండి ఐటి ఎగుమతులు భారీగా పెరిగాయని అంటున్నారు, ఇక జిఎస్టీ పెట్రోల్, లిక్కర్, రిజిస్ట్రేషన్లు వీటన్నింటి నుంచి ఆదాయం వస్తుందికదా.. మరి ఈ ఆదాయం అంతా ఎటుపోయింది.?  ఏడేళ్లలో 14 లక్షల కోట్లు, 4 లక్షల అప్పులు కలిపి 18 లక్షల కోట్లు ఏమయ్యాయి అని దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీస ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఎలా పాలిస్తున్నారు? దేశంలో ఉన్న ఒక చిన్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్.. కానీ నేడు దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీ గా ఎలా మారింది.. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయల చందాలు ఎలా ఇచ్చింది..? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

నేడు దేశంలో ధనిక కుటుంబంగా కల్వకుంట్ల కుటుంబం ఎదిగిందని, నేడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లకు వందల ఎకరాలలో ఫామ్ హౌస్ లు వచ్చాయి.., వేలాది అడుగుల విస్తీర్ణంలో బంగాళాలు ఎలా వచ్చాయి? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పథకాలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. హరీష్ రావు ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారని, సంక్షేమ పథకాలను అమలు చేయవద్దా, రైతు బంధు ఇవ్వవద్దా ?  అని అడుగుతున్నారు.. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా..?  టిఆర్ఎస్ నాయకులకు చీము, నెత్తురు లేదా..? ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే.. ఓనర్ కాదు.. అమ్మే హక్కు మీకు లేదు, మీ నిర్ణయాలపై అన్ని రకాల పోరాటాలు చేస్తామని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. ప్రజల భవిష్యత్ తరాల కోసం భూములు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.