పెరుగుతున్న డ్రోన్ల ట్రాఫిక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పెరుగుతున్న డ్రోన్ల ట్రాఫిక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

డ్రోన్లు వినియోగం రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు..ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లను వినియోగించకుండా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.  దీనికోసం.. కేంద్ర పౌర విమానయాన శాఖ డ్రోన్ల ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళికను రూపొందిస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు తోపాటు థర్డ్ పార్టీ సేవలు అందించే సంస్థలు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. డ్రోన్లన్నీ 1,000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున  అందుకు అనుగునంగా నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం వాయు మార్గాలపై 'ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ (ATM) విధానం అమల్లో ఉంది. ఇది మానవ రహిత విమానాల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో కొత్త విధానాన్ని రూపొందించింది.

డ్రోన్లను మానవ రహిత విమానాలుగా పరిగణిస్తున్నందున దీని కోసం అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టం ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ను రూపొందించిందికేంద్ర పౌర విమానయాన శాఖ. దీన్ని UTMగా వ్యవహరిస్తోంది. ఇది ఆటోమేటిక్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సహకారంతో పనిచేస్తుంది. భవిష్యత్తుల్లో ATM,UTM వ్యవస్థలను అనుసంధానం చేసి పరస్పర ప్రయోజనాలు పొందాలని ప్రతిపాదించింది. దీంతోపాటు.. ప్రైవేటు సంస్థలు రిజిస్ట్రేషన్, ఫ్లైట్‌ ప్లానింగ్, ఎగిరే డ్రోన్ల మధ్య దూరం ఉండేలా చూడడం, వాతావరణం సమాచారం తెలపడం వంటి సేవలు అందించవచ్చు. పైలట్లతో నడుస్తున్న విమానాలు కూడా ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్‌ నిర్వాహకులు అనుమతులు పొందాల్సి ఉంటుందని చెప్పింది. డ్రోన్లు ప్రయాణం విషయమై ఏర్పాటు చేసే కేంద్రానికి ప్రతి నిర్వాహకుడు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ సమయంలో ఎక్కడ ఎగురుతోందన్న వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తుండాలని తెలిపింది. ఇది నేరుగాగానీ, తృతీయ పక్ష సేవలు అందించే సంస్థ ద్వారాగానీ ఇవ్వవచ్చు. ఈ సేవలు అందించే సంస్థకు మొదట తక్కువ పరిధిలో ఉండే భౌగోళిక ప్రాంతాన్ని కేటాయిస్తారు. ఆ తర్వాత ఆ పరిధిని విస్తరిస్తారు. ఈ సేవలు అందించినందుకు ఆ సంస్థలు పన్నులు  వసూలు చేయవచ్చు. ఇందులో కొంతభాగాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలు అందించే సంస్థలు ఆటోమేటెడ్‌గా పనిచేసే ఆల్గారిథం ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, దీంతో ఆ సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ స్మిత్‌ షా కోరారు.