- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2199 మంది ఎంపికకు కసరత్తు
- రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున నియామకం
- పదో తరగతి పాసై, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారి ఎంపిక
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రైతులకు సపోర్టుగా వలంటీర్లను గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూసార సంరక్షణ, భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున వలంటీర్లను నియమించనుంది. వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత, ఒక్కో వలంటీర్ పది మంది రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తారు. రైతులందరికీ నేల ఆరోగ్య కార్డులను కూడా పంపిణీ చేస్తారు.
మట్టి నమూనాలు సేకరించడం, వాటి పరీక్షలు పూర్తయిన తర్వాత రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించడం, ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, భూమిలో ఉన్న పోషకాలకు అనుగుణంగా తగిన పంటలు పండించే విధంగా వారికి అవగాహన కల్పించడం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల కోసం వాలంటీర్లను ఉపయోగించుకోనున్నారు.
ఒక్కో గ్రామానికి ముగ్గురు..
ఖమ్మం జిల్లాలో 379 రెవెన్యూ గ్రామాలుండగా ఒక్కో గ్రామానికి ముగ్గురు చొప్పున 1137 మంది, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 354 గ్రామాలుండగా 1062 మంది వలంటీర్లను నియమించనున్నారు. గ్రామాల్లో ఉంటూ పదో తరగతి పాసై, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారిని వలంటీర్లుగా ఎంపిక చేస్తారు. ఖమ్మం జిల్లా వలంటీర్లకు వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో, భద్రాద్రి జిల్లా వలంటీర్లకు కొత్తగూడెం కేవీకేలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కు చెందిన వారికి ఈనెల6న హైదరాబాద్లోని ఇక్రిశాట్ లో ఆఫీసర్లు ట్రైనింగ్ ఇచ్చారు.
రెండో విడతలో భాగంగా పది జిల్లాల వలంటీర్లకు రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ట్రైనింగ్ ఇచ్చారు. వలంటీర్ల ట్రైనింగ్ తర్వాత ప్రతి రైతు పొలంలో సాయిల్ టెస్టులు చేసి, రిపోర్టు కార్డులను ఆయా రైతులకు అందజేస్తారు. వారి భూముల్లో ఉన్న పోషకాల ఆధారంగా ఏఏ పంటలు లాభదాయకమో వివరిస్తారు. వాటి ఆధారంగా వచ్చే వానాకాలంలో పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులకు, వ్యవసాయ శాఖ అధికారులకు అనుసంధానంగా ఈ వలంటీర్లు వ్యవహరిస్తారని అధికారులు చెబుతున్నారు.
వాలంటీర్ల ఎంపిక పూర్తయింది..
ఖమ్మం జిల్లాకు అవసరమైన 1137 మంది వలంటీర్ల ఎంపికను పూర్తి చేశాం. వారికి శిక్షణకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంది. దాని ప్రకారం వారికి హైదరాబాద్ లో శిక్షణ ఉంటుందా, లేక జిల్లా స్థాయిలోనే ఉంటుందా అనే క్లారిటీ వస్తుంది. వలంటీర్లు ఉచితంగానే సేవలు అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు.- ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఖమ్మం

