- సాధ్యాసాధ్యాలను పరిశీలించండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పరీక్షను నిర్వహించే అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.స్పెషల్ టెట్ నిర్వహించడంతో పాటు ఆ పరీక్షను ఆఫ్ లైన్ పద్ధతిలో చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా కోరారు. ఈ మేరకు అధికారిక మెమో రిలీజ్ చేశారు. టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో పాటు పీఆర్టీయూ, ఎస్టీయూటీఎస్, టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన విజ్ఞప్తులను ఈ మెమోకు జత చేశారు.
ఇన్ సర్వీస్ టీచర్ల విన్నపాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం టీచర్లకు ప్రమోషన్ల విషయంలో టెట్ నిబంధన కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్ల సౌలభ్యం కోసం ఏడాదికి మూడు సార్లు పరీక్ష నిర్వహించాలని, అలాగే కంప్యూటర్ బేస్డ్ కాకుండా పాత పద్ధతిలోనే ఆఫ్ లైన్ లో ఎగ్జామ్ పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. తమిళనాడులో టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

