MBBS కు రూ.40 వేలు.. స్పెషలిస్ట్​కు రూ.లక్ష

MBBS కు రూ.40 వేలు.. స్పెషలిస్ట్​కు రూ.లక్ష
  •     నర్సులకు రూ.23 వేలు.. ల్యాబ్​టెక్నీషియన్​కు రూ.17 వేల జీతం
  •     పోస్టుల సంఖ్య, కాంట్రాక్ట్​ పీరియడ్​, డ్యూటీ ప్లేస్​పై నో క్లారిటీ 

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలో టెంపరరీ బేసిస్‌‌లో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌‌ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 22 వరకు ఆన్‌‌లైన్‌‌లో( https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx ) దరఖాస్తు చేసుకోవాలంది. కొత్తగా ఎంబీబీఎస్ పూర్తయిన వారు మొదలు రిటైర్డ్ డాక్టర్లు, నర్సులు కూడా పోస్టులకు అర్హులేనని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. రిక్రూట్‌‌ అయిన వాళ్లు ప్రభుత్వ దవాఖాన్లలో పని చేయాల్సి ఉంటుందని, స్పెషలిస్టు డాక్టర్లకు నెలకు రూ.లక్ష, ఎంబీబీఎస్ డాక్టర్‌‌‌‌కు రూ.40 వేలు, ఆయుష్ డాక్టర్‌‌‌‌కు నెలకు రూ.35 వేలు, స్టాఫ్‌‌ నర్సుకు నెలకు రూ.23 వేలు, ల్యాబ్ టెక్నీషియన్‌‌కు రూ.17 వేల జీతం ఇస్తామంది. 

వీటిపై క్లారిటీ లేదు..

ఇది కాంట్రాక్ట్ బేసిస్ నోటిఫికేషన్‌‌ మాత్రమేనని క్లియర్‌‌‌‌గా పేర్కొన్న సర్కారు కొన్ని వివరాలపై స్పష్టత ఇవ్వలేదు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎక్కడున్నాయనే విషయాలపై నోటిఫికేషన్‌‌లో వివరించలేదు. అయితే అప్లై చేసిన వాళ్లందరినీ తీసుకోవాలనే యోచనలో సర్కార్ ఉందని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.  కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్న ఈ ఉద్యోగాలు ఎన్ని నెలలు ఉంటాయన్నదీ తెలియజేయలేదు. దీన్ని బట్టి ప్రభుత్వానికి అవసరం ఉన్నంత వరకూ మాత్రమే ఈ ఉద్యోగాలు ఉంటాయనేది స్పష్టమవుతోంది. గతంలోనూ ఇలాగే మూడు, నాలుగు నెలల కాలానికి నోటిఫికేషన్ ఇవ్వగా, డాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి అదే విధమైన నోటిఫికేషన్ ఇచ్చారు. 

అడ్డా కూలీలమా?

ప్రైవేట్ హాస్పిటళ్లలో ఎంబీబీఎస్ డాక్టర్లకు కనీసం రూ. లక్ష, స్పెషలిస్టుకు రూ.లక్షన్నర పైగా జీతం ఇస్తుండగా సర్కార్ వాటిలో సగం జీతాలు ఆఫర్ చేయడం గమనార్హం. పైగా ఏ విషయంపైనా నోటిఫికేషన్‌‌లో క్లారిటీ ఇవ్వకపోవడంపై డాక్టర్లు మండిపడుతున్నారు. తామేమైనా అడ్డా కూలీలమని అనుకుంటున్నారా? అంటూ  డాక్టర్లు, నర్సులు ఫైర్ అవుతున్నారు.