- రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా
- సీలింగ్, అసైన్డ్, భూదాన్ భూములనూ వదలని అక్రమార్కులు
- డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ మొదలు అక్రమ మ్యుటేషన్ల
- దాకా ఎన్నో వ్యూహాలు ఆక్రమించి.. కోర్టుల నుంచి స్టేలు తెచ్చి.. యథేచ్ఛగా నిర్మాణాలు
- రోజురోజుకూ పెరుగుతున్న ఫిర్యాదులు
- ఫీల్డ్ సర్వే ద్వారా రికార్డులను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన సర్కారు
హైదరాబాద్, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్‌ను అనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూమాఫియా రెచ్చిపోతోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా పెడ్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన 12 ఏండ్లలో భూదందాలు అనేక రెట్లు పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడు జిల్లాల్లోని ప్రభుత్వ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఇప్పటికే బడా బాబుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్, భూదాన్ భూములకు ఎన్వోసీలు తేవడం, డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేయడం, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ మ్యుటేషన్లు, తప్పుడు పత్రాలతో కోర్టులకెక్కడం, రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టడం, అమాయకులకు అంటగట్టడం.. ఇలా భూబకాసురుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది.
ఇలాంటి అక్రమార్కుల చేతుల్లో మోసపోతున్నవారి నుంచి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర ఫీల్డ్ సర్వే'కు సిద్ధమవుతోంది. ఫైసల్ పట్టీ, ముంతకాబ్, ఖాస్రా పహానీ, సెత్వార్, టిప్పన్ వంటి అన్ని రికార్డులను రెడీ చేసుకుని ఫీల్డ్‌సర్వే చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలితే పక్కా ఆధారాలతో రికార్డులను డిజిటలైజ్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో కిందిస్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వ భూములకు సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ఉన్నాయో లెక్కతీయిస్తోంది. ఈ మూడు జిల్లాల పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ భూములు 7.22 లక్షల ఎకరాలు ఉండగా, అందులో అటవీ భూములు 1.73 లక్షల ఎకరాలు, వివిధ ప్రభుత్వ సంస్థల కింద ఉన్న పబ్లిక్ అసెట్స్ 82 వేల ఎకరాలున్నాయి. ఇవి పోగా మిగిలిన అసైన్డ్, పోరంబోకు, బంజరు, సీలింగ్ భూముల విస్తీర్ణం సుమారు 4.67 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులోనే నాలుగో వంతు భూమి అక్రమార్కుల చెరలో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
పహానీల్లో ‘ప్రభుత్వ’ కాలమ్ మాయం..
ప్రభుత్వ భూములను చెరబట్టేందుకు భూబకాసురులు అనుసరిస్తున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. వీరు ముందుగా ప్రభుత్వ, అసైన్డ్, పోరంబోకు, ఖారిజ్ ఖాతా, గైరాన్ , బంజరు, సీలింగ్ తదితర భూముల్లో తమకు అనువైన వాటిని ఎంచుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులు, సిబ్బంది సాయంతో రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పహాణీల్లో ఏకంగా ‘ప్రభుత్వ భూమి’ అనే కాలమ్‌నే మాయం చేస్తున్నారు. తమకు వారసత్వంగా ఆ భూములు వచ్చినట్లుగా పాత డాక్యుమెంట్లను సృష్టించి, తప్పుడు వారసుల పేర్లతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
నిషేధిత జాబితాలో ఉండాల్సిన సర్వే నంబర్లను రికార్డుల్లో తొలగించి, పట్టా భూములుగా మార్పించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రే షెడ్లు వేయడం, ప్రహరీ గోడలు నిర్మించడం ద్వారా కబ్జాకు తెరలేపుతున్నారు. ఒకవేళ అధికారులు అడ్డుకుంటే, తప్పుడు పత్రాలతో కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకుని ఏళ్లపాటు కాలయాపన చేస్తున్నారు. ఆ స్టే సాకుతోనే అక్రమంగా బహుళ అంతస్తుల భవనాలు, వెంచర్లు వేసి అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థల పేరిట ఉన్న స్థలాలను కూడా వదలకుండా రాజకీయ పలుకుబడితో జీపీఏలు సృష్టించి అక్రమ దందా సాగిస్తుననారు. ఇలా రికార్డుల మాయాజాలం, క్షేత్రస్థాయి ఆక్రమణల వెనుక పలువురు రెవెన్యూ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
మేడ్చల్.. సంగారెడ్డి జిల్లాల్లోనూ అదే దందా
సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాలో రికార్డుల ప్రకారం 1,08,187 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ భూమి (1.61 లక్షల ఎకరాలు)లో మూడింట రెండు వంతులు అసైన్డ్ భూమే కావడం గమనార్హం. పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్న పటాన్‌చెరు, అమీన్‌పూర్ వంటి ప్రాంతాల్లో అసైన్డ్ భూములను అక్రమంగా విక్రయించి, రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేసిన ఉదంతాలు కోకొల్లలు. దీనిపై ప్రభుత్వానికి వందల్లో కంప్లయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ 1,309 ఎకరాల్లో భూదాన్ భూములు ఉండగా, వాటిని కూడా వదలకుండా కబ్జాదారులు చెరబట్టారు. అమీన్‌పూర్ మండలంలో ప్రభుత్వ గుట్టలను సైతం పిండి చేసి వెంచర్లుగా మారుస్తున్నారు. ఇక్కడ ఒకే భూమికి రెండు, మూడు రకాల రిజిస్ట్రేషన్లు ఉండడం, సర్కారు రికార్డుల్లో ఒక పేరు.. క్షేత్రస్థాయిలో మరొకరి కబ్జాఉండటం గమనార్హం. విలువైన సీలింగ్ భూములను సైతం కోర్టు కేసుల పేరుతో ఏళ్ల తరబడి అనుభవించడం ఇక్కడ భూమాఫియాకు రోటిన్‌గా మారింది. ఇక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో పట్టణీకరణ పుణ్యమా అని అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. జిల్లాలో 1.21 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 8,446 ఎకరాల అసైన్డ్ భూములు, 1,004 ఎకరాల్లో భూదాన్ భూములు ఉన్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్‌కేసర్, కీసర వంటి ప్రాంతాల్లో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మించారు. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన వేల ఎకరాల ‘పబ్లిక్ అసెట్స్’లో కూడా చొరబాట్లు జరగడం కలకలం రేపుతోంది. అక్రమ లేఅవుట్లకు అనుమతులు పొందడం, పాత తేదీలతో డాక్యుమెంట్లు సృష్టిస్తూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
- సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మండలం ప్రాంతంలో 226, 230, 164 సర్వే నెంబర్లలో సుమారు 1,200 ఎకరాల సీలింగ్ భూమి అన్యాక్రాంతమైంది. ప్రధానంగా సర్వే నంబర్ 226లో చెరువు శిఖం భూములను సైతం మట్టితో నింపి వెంచర్లుగా మార్చారు. ఇక్కడ రికార్డుల్లో పట్టా భూములుగా మార్చడానికి రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గతంలో విచారణలో తేలింది. వందల ఎకరాల సీలింగ్ భూమిని ప్లాట్లుగా చేసి సామాన్యులకు అమ్మేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోవాలంటే వేల ఇళ్లను కూల్చాల్సి వస్తోంది.
- రంగారెడ్డి జిల్లా హాఫీజ్‌పేట్ లో 77, 78, 79, 80 సర్వే నెంబర్లలో దాదాపు 484 ఎకరాల ప్రభుత్వ భూమి దశాబ్దాలుగా వివాదంలో ఉంది. ఇది నిజాం కాలం నాటి ‘పైగా’ భూమి అని క్లెయిమ్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు కోర్టుల ద్వారా పాగా వేశారు. ఈ భూమిని ప్రభుత్వ భూమిగా సుప్రీంకోర్టు వరకు పోరాడినా, క్షేత్రస్థాయిలో మాత్రం వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, భారీ అపార్ట్‌మెంట్లు వెలిశాయి.
- కొన్ని ప్రభుత్వ భూములను 58, 59 జీవోల కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు రంగారెడ్డి జిల్లాలో ప్రైమ్ ఏరియాల్లో వందల ఎకరాలు కబ్జా చేశారు.
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని 162, 163, 165 సర్వే నంబర్లలో సుమారు 450 ఎకరాల భూదాన్ భూమి ఉంది. వినోభాభావే పాదయాత్ర సమయంలో దానం చేసిన ఈ భూములను పేదలకు పంచాల్సి ఉండగా, కొందరు స్థానిక నాయకులు, రియల్టర్లు కుమ్మక్కై నకిలీ వారసులను తెరపైకి తెచ్చారు. భూదాన్ బోర్డు నుంచి ఎన్ఓసీలు , ఇతర రికార్డులు సృష్టించి, ఏకంగా వెంచర్లుగా మార్చి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ కోట్లాది రూపాయల విలువైన విల్లాలు వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఇది భూదాన్ భూమిగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉంది.
- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని సర్వే నంబర్ 329లో సుమారు 400 ఎకరాలకు పైగా సీలింగ్ భూమి ఉంది. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో భూమిని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయాలని భావించింది. కానీ, రియల్ మాఫియా పాత సాగు దారుల పేరుతో కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని, రాత్రికి రాత్రే షెడ్లు, ప్రహరీలు నిర్మించేసింది. సర్వే నంబర్ 79లో ప్రభుత్వ భూమిని సైతం ప్రైవేట్ పట్టా భూమిగా మార్చేసి లేఅవుట్లు వేశారు. ఇక్కడ ప్రభుత్వ బోర్డులు పెడితే కబ్జాదారులు వాటిని తొలగించి తమ బోర్డులు పెట్టుకోవడం గమనార్హం.
ప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి టాప్
రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాల పర్వం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో చూస్తే ఈ జిల్లానే భూ అక్రమాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఎక్కడ చూసినా ఎకరం కోట్లు పలుకుతుండడంతో అక్రమార్కులు ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూమిని వదలట్లేదు. ఇక్కడ మొత్తం 2.16 లక్షల ఎకరాల్లో వివిధ రకాల ప్రభుత్వ భూములు ఉండగా, 90,967 ఎకరాల్లో అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట భూకబ్జా వెలుగుచూస్తోంది. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పట్టా భూములుగా మార్చేసుకోవడం పరిపాటిగా మారింది. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో భూదాన్ భూముల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 23,542 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, అందులో ఏకంగా 7 వేల ఎకరాలకు పైగా వివాదాల్లో చిక్కుకుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో పేదలకు చెందాల్సిన భూములను బడా రియల్టర్లు వెంచర్లుగా మార్చేశారు. మహేశ్వరం పరిధిలోని ఒక కీలక సర్వే నంబర్‌లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థ తన సొంత భూమిగా క్లెయిమ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. స్టే ఆర్డర్ ఉండగానే అక్కడ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల అండదండలతో ‘ప్రోహిబిటెడ్ లిస్ట్’ (22ఏ) నుంచి భూమిని తొలగించి క్రయవిక్రయాలు సాగించడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.
