వెయ్యి స్తంభాల గుడి రిపేర్లు పూర్తి చేయట్లే.!

వెయ్యి స్తంభాల గుడి రిపేర్లు పూర్తి చేయట్లే.!
  • 2006లో రూ. 7.5 కోట్లు మంజూరు
  • అసంపూర్తిగా కల్యాణ మండపం
  • అమలుకాని చీఫ్‍ విప్‍,మాజీ ఎంపీ హామీలు

వరంగల్‍  రూరల్‍, వెలుగువరంగల్​ అంటే వెయ్యి స్తంభాల గుడి. వెయ్యి స్తంభాల గుడి అంటే వరంగల్. ఈ రెండింటి మధ్య విడదీయలేనంత అనుబంధం ఉంది. కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి  మణిమకుటం లాంటి ఈ కట్టడాన్ని చూసేందుకు నిత్యం పెద్దసంఖ్యలో టూరిస్టులు వరంగల్​ వస్తుంటారు. వచ్చేటప్పుడు ఏదేదో ఊహించుకుంటారు. తీరా ఇక్కడ గుడి పరిస్థితి చూసి  డిసప్పాయింట్‍ అవుతున్నారు. రుద్రుడు, నందీశ్వరుడు ఉండేచోటు, ఓ నాలుగు బోర్డులు తప్ప స్తంభాలన్నీ చెట్ల పొదల్లో పడి ఉన్నాయి. మధ్యలో ఆగిన కల్యాణ మండప పనులు, అక్కడక్కడ విరిగిన రాతి శిల్పాలు, పాకురుపట్టిన  కోనేరు, చిన్నచిన్న రాళ్లతో నడవలేని స్థితిలో ఉన్న లోపలి దారి వెయ్యి స్తంభాల గుడిపై సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

2006లో ప్రారంభమైన పనులు

వెయ్యిస్తంభాల గుడి రీ కన్​స్ట్రక్షన్​ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. ఇందులో కీలకమైంది కల్యాణ మండప నిర్మాణం. పనుల కోసం కేంద్ర పురావస్తుశాఖ రూ.7.5  కోట్లు కేటాయించింది. తమిళనాడుకు  చెందిన  స్తపతి  శివకుమార్ 70 మంది శిల్పకారులతో కలిసి  పనులు ప్రారంభించారు. ముందుగా అనుకున్న ప్రకారం రెండేండ్లలో పనులు పూర్తిచేయాలి.  కొంతభాగం పూర్తయినా రెగ్యులర్‍ మానిటరింగ్‍ లేకపోవడంతో స్తపతి పనులను మధ్యలోనే ఆపేసి చెన్నై వెళ్లిపోయారు.  కేంద్రమిచ్చిన బడ్జెట్‍లో ఏ  పనులకు ఎంత ఖర్చు చేశారనే  వివరాలను ఇక్కడి ఆఫీసర్లు  ఇన్​టైంలో పంపలేదు.  కొన్ని వర్క్స్​రూల్స్​కు విరుద్ధంగా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2008లో  పనులు మళ్లీ స్టార్ట్​ చేసే టైంలో పాత రేట్లకు చేయడం కుదరదని కాంట్రాక్టర్​స్పష్టం చేశారు. మరో  రూ.6  కోట్ల  బడ్జెట్‍ అవసరమని చెప్పారు. దీనిని శాంక్షన్​ చేయించేవారు లేక పనులు అక్కడే ఆగిపోయాయి.

ఏడాది హామీ మరిచిన లీడర్లు

గతేడాది అక్టోబర్‍లో  ప్రభుత్వ చీఫ్‍ విప్‍  వినయ్‍భాస్కర్‍, రాష్ట్ర ప్లానింగ్​ కమిషన్​ఉపాధ్యక్షుడు వినోద్‍కుమార్‍తో కలిసి వెయ్యిస్తంభాల గుడిని సందర్శించారు.  వరంగల్‍ ఎంపీ  పసునూరి దయాకర్‍, మేయర్‍  గుండా  ప్రకాశ్‍,  కేంద్ర పురావస్తుశాఖ  రాష్ట్ర  సూపరింటెండెంట్‍  మిలాన్‍  కుమార్‍ ను వెంట తీసుకొచ్చారు.  ప్రాచీన  కట్టడాల  పరిరక్షణకు  సీఎం కేసీఆర్‍ కట్టుబడి ఉన్నారని చెప్పారు.  కావాల్సిన ఫండ్స్​ అప్పటి  పార్లమెంట్‍ వింటర్​ సమావేశాల్లో మంజూరయ్యేలా  బాధ్యత తీసుకుని  ఏడాదిలోపు  పనులు పూర్తయ్యేలా చూస్తామని  హామీ ఇచ్చారు. నాలుగు రోజుల్లో వారు చెప్పిన  ఏడాది గడువు పూర్తవుతుంది. ఇప్పటికీ  మూలకున్న పిల్లర్లను ముట్టుకున్నవారు లేరు. ప్రస్తుతం పార్లమెంట్‍ సమావేశాలు  ప్రారంభమయ్యాయి. ఇప్పటికైనా మన లీడర్లు సీరియస్‍గా పనిచేసి  కావాల్సిన పర్మిషన్లు, ఫండ్స్​ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లర్లకు పెట్టిన సింబల్స్​పోయినయ్‍

వెయ్యిస్తంభాల గుడి పునర్నిర్మాణంలో భాగంగా కల్యాణ మండపంలో ఏ పిల్లర్‍ ఎక్కడ పెట్టాలో ఈజీగా తెలిసేందుకు శిల్పులు పేయింటింగ్‍తో మార్కింగ్​ పెట్టుకున్నారు. తీరా 14 ఏండ్ల టైం పట్టడంతో ఎండ, వాన కారణంగా అవి ఎక్కడికక్కడ పోయాయి. శిల్పులు ఇప్పుడు వాటిని గుర్తుపట్టడం పెద్ద సవాలే.  నాడు తీయించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా వారు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే సకాలంలో ఫండ్స్​ తేవాలి. అనుమతులు ఇప్పించాలి. బడ్జెట్‍ ఆధారంగా టెండర్లు పిలవాలి. అప్పట్లో ఈ కాంట్రాక్ట్​ తీసుకున్న  స్తపతి శివకుమార్‍ తిరిగి సకాలంలో ఈ వర్క్స్​ కంప్లీట్‍ చేసేలా అగ్రిమెంట్‍ చేసుకోవాలి.