ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కార్ ప్లాన్

ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కార్ ప్లాన్
  • ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కార్ ప్లాన్
  • ఇన్​కమ్ పెరిగితేనే కొత్త పెన్షన్లు, బడ్జెట్ హామీలకు మోక్షం!

హైదరాబాద్, వెలుగు: నెలవారీ ఆదాయాన్ని ఇంకో రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దాకా పెంచుకోవాలని రాష్ట్ర సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రాబడి పెంపు ఎలా అనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడి, అప్పులు, పథకాలకు అయ్యే ఖర్చు, క్యాపిటల్ ఖర్చులు ఇతరత్రా వాటిపై​ఒక రిపోర్ట్ తయారు చేసి సర్కార్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చినట్లు తెలిసింది. కొన్ని పథకాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర సొంత ఆదాయం కచ్చితంగా పెరగాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా.. కొత్తగా ఏదైనా స్కీం తీసుకురావాలన్నా ప్రజలపై బాదుడు పోటు తప్పదని పేర్కొన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రిజిస్ర్టేషన్ల చార్జీలు పెంచాలని సర్కారు భావిస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. లిక్కర్ ధరల పెంపు, మైనింగ్ విధానంలో మార్పులు, గ్రానైట్ రాబడి, పట్టణ, స్థానిక సంస్థలు పన్నులు పెంచడం వంటి ద్వారా సొంత రాబడి పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.

ఆ రెండింటిపైనే దృష్టి 

జీఎస్టీ తర్వాత.. ఎక్సైజ్‌‌‌‌, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ రెండు ప్రధాన వనరులుగా ఉన్నాయి. ఈ రెండింటితో దాదాపు రూ.2,500 కోట్లు సమకూరుతున్నాయి. ఇది ఇంకో వెయ్యి కోట్లు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఆరు నెలల కిందట భూముల విలువలు సవరించి, రిజిస్ర్టేషన్ చార్జీలు పెంచారు. దీంతో రూ.300 కోట్లు దాకా అదనంగా వస్తోంది. ఇప్పుడు జీఎస్టీతో యావరేజ్‌‌‌‌గా నెలకు రూ.4 వేల కోట్ల దాకా వస్తున్నాయి. కరోనా పరిస్థితులు చక్కబడితే ఇది ఇంకో రూ.500 కోట్ల వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. పెట్టుబడులు, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ దూకుడుతో భూములు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ రిజిస్ర్టేషన్​ చార్జీలు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మైనింగ్ ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేయడం ద్వారా రాబడి పెంచుకోవాలని చూస్తోంది. మొన్న గ్రానైట్ నిర్వాహకులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం ఈ నేపథ్యంలో సాగింది. ఇసుక ద్వారా ఇన్​కమ్‌‌‌‌ పెంచుకునే దానిపైనా సర్కార్ ప్లాన్లు చేస్తోంది.

ప్రతి నెలా రూ.18 వేల కోట్లు అవసరం

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అమలవుతున్న స్కీంలు, అప్పులకు కిస్తీలు, వడ్డీల చెల్లింపులు లాంటివి అన్ని కలిపితే ప్రతి నెలా యావరేజ్‌‌‌‌గా రూ.18 వేల కోట్లు అవసరం అవుతాయని ఫైనాన్స్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లకు రూ.3,500 కోట్లు, ఆసరాకు రూ.900 కోట్లు, ఇతర ముఖ్యమైన పథకాలకు యావరేజ్‌‌‌‌గా రూ.9 వేల కోట్లు, ప్రాజెక్టులు, ఇతర క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్‌‌‌‌‌‌‌‌కు అవసరం ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర రాబడి, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్, అప్పులు అన్ని కలిపితే రూ.13 వేల కోట్ల వరకు వస్తోందని, ఇంకా ఐదు కోట్ల రూపాయల గ్యాప్ ఉంటోందని ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫీసర్లు అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో 8 నెలల్లో రూ.1.36 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. రూ.లక్ష కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఉన్న వాటికే సర్దుబాటు చేసే పరిస్థితి లేకపోవడంతోనే కొత్త ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. బడ్జెట్‌‌‌‌లో చెప్పిన జాగా ఉన్నోళ్లకు రూ.5 లక్షలు అమలు చేయలేని స్థితి నెలకొంది. పైగా దళితబంధు స్కీంకు వేల కోట్లు పెడుతామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. దీంతో బాదుడు ద్వారానే సొంత ఆదాయం పెంచుకునేలా ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.