- 36.57 లక్షలతో మాదిగలు ఓవరాల్ టాప్
- ముదిరాజ్‌లు 26.39 లక్షల మంది
- ఎస్టీల్లో 24.04 లక్షలతో లంబాడాలు ఫస్ట్
- ఎస్సీల్లో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండోస్థానంలో మాలలు
- నో కాస్ట్ విభాగంలో 11.96 లక్షల మంది
- పది కులాల్లోనే 60 శాతం జనాభా
- 135 కులాల్లో అత్యంత వెనుకబాటుతనం
- అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి
- ఇదే ‘సోషల్ జస్టిస్ 2.0’ అని అభివర్ణించిన నిపుణుల బృందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 36 లక్షల 57 వేల 551 (10.3%) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజికవర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం బయటపెట్టింది. ఉపకులాలవారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27 లక్షల 95 వేల 727 (7.9%) మందితో షేక్ ముస్లింలు రెండోస్థానంలో నిలవగా, 26 లక్షల39 వేల 027 (7.4%) మందితో ముదిరాజ్ సామాజిక వర్గం మూడో స్థానాన్ని ఆక్రమించింది.
ఈ ముదిరాజ్కులం జనాభా పరంగా బీసీల్లో అతి పెద్ద సామాజికవర్గంగా అవతరించింది. గిరిజన తెగల్లో 24,04,056 (6.8%) మందితో లంబాడాలు, వెనుకబడిన తరగతుల్లో 20,18,725 (5.7%) మందితో యాదవులు, 16,30,187 (4.6%) మందితో గౌడ సామాజిక వర్గాలు తమ సంఖ్యాబలాన్ని చాటుకోగా, ఓపెన్ కేటగిరీలో 17,10,244 (4.8%) జనాభాతో రెడ్డి సామాజిక వర్గం టాప్లో నిలిచింది. షెడ్యూల్డ్ కులాల్లో మాదిగల తర్వాత 14,71,514 (4.1%) సంఖ్యతో మాలలు ప్రాబల్యం చాటారు.
ఈ సర్వే కేవలం అంకెలను మాత్రమే కాకుండా, ఆయా కులాల సామాజిక అసమానతలను కళ్లకుగట్టింది. ముఖ్యంగా డక్కలి, పిచ్చకుంట్ల , తురక ముస్లిం లాంటి ఉపకులాలు తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని పేర్కొంది. సంక్షేమ పథకాల అమలులో మరింత సామాజిక న్యాయం అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీసీ జనాభా సింహభాగం ఉన్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతులు (బీసీ/ఓబీసీ) 56.4 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.4 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.4 శాతం, ఇతర కులాలు (ఓసీ/జనరల్) 11.9 శాతంగా నమోదయ్యాయి. అలాగే ‘కుల రహిత’ (నో కాస్ట్) గుర్తింపు కోరుకున్న వారు 11.96 లక్షల మంది 3.4 శాతంగా ఉండటం గమనార్హం.
రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో కేవలం 10 కులాలు మాత్రమే 60 శాతం జనాభాను కలిగి ఉండటం సామాజిక కేంద్రీకరణను సూచిస్తోంది. ‘జనాభా నిష్పత్తి ప్రకారం వాటా’ అనే పాత నినాదం నుంచి ‘వెనుకబాటుతనం నిష్పత్తి ప్రకారం వాటా’ అనే కొత్త నినాదం సరైనదేనని నివేదిక పేర్కొంది. కేవలం సంఖ్యను బట్టి కాకుండా, సీబీఐ స్కోరు ఆధారంగా ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో వారికే సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడడమే అసలైన సామాజిక న్యాయమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. దీన్నే ‘సోషల్ జస్టిస్ 2.0’ గా అభివర్ణించింది. సంక్షేమ పథకాలను ఒక సాధారణ బావిలా కాకుండా, ప్రతి ఇంటికీ వెళ్లే ‘సామాజిక న్యాయం ట్యాప్’లా మార్చాలని బృందం సూచించింది.
వెనుకబడిన తరగతుల్లో బీసీ-(డీ) కేటగిరీ జనాభా పరంగా అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గం 26,39,027 (7.4%) జనాభాతో బీసీల్లోనే అగ్రస్థానంలో నిలవగా, వారి రాజకీయ, ఆర్థిక బలం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉంది. వీరి తర్వాత యాదవ (గొల్ల) కులం 20,18,725 (5.7%) సంఖ్యతో పశుపోషణ , వ్యవసాయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా మున్నూరుకాపు కులం 13,75,018 (3.9%) జనాభాతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలమైన సామాజిక శక్తిగా కొనసాగుతున్నది. ఈ మూడు కులాలు కలిసి
బీసీ-–డీ విభాగంలో సింహభాగాన్ని ఆక్రమించాయి. అయినప్పటికీ, వీరి సీబీఐ స్కోర్లు 66 నుంచి 94 మధ్యలో ఉండడం గమనార్హం. అంటే సంఖ్యాబలం ఉన్నప్పటికీ, వీరు ఆశించిన స్థాయిలో విద్య, ఉపాధి రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని ఈ సామాజిక ఎక్స్‌రే విశ్లేషిస్తోంది.
- బీసీ (బీ) వర్గాల్లో గౌడ, పద్మశాలీల ఆధిపత్యం
బీసీ(-బీ) విభాగంలో వృత్తి కులాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం 16,30,187 (4.6%) జనాభాతో ఈ కేటగిరీలో పెద్ద కులంగా నిలిచింది. కల్లు గీత వృత్తిపై ఆధారపడిన ఈ వర్గం, సామాజికంగా 77 సీబీఐ స్కోరును కలిగి ఉంది. చేనేత రంగంపై ఆధారపడిన పద్మశాలీ కులం 11,82,252 (3.3%) జనాభాతో రెండో స్థానంలో ఉంది. ఈ వర్గం సీబీఐ స్కోరు 67గా ఉంది, ఇది కొంత మెరుగైన స్థితిని సూచిస్తున్నప్పటికీ, వృత్తిపరమైన సంక్షోభాల వల్ల వీరు ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఇదే విభాగంలోని కురుమ / కురుబ కులం 7,95,822 (2.2%) సంఖ్యతో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. బీసీ-బీలో ఉన్న ఈ ప్రధాన వృత్తి కులాల జనాభా కలిపితే దాదాపు 10 శాతానికి చేరువలో ఉంది. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా నిధుల మళ్లింపు అత్యవసరమని సర్వే నివేదిక సూచించింది.
- పట్టణాల నుంచి ‘నో కాస్ట్’
ఈ సర్వేలో అత్యంత ఆసక్తికరమైన అంశం ‘నో కాస్ట్’ గా దాదాపు 12 లక్షల మంది ప్రజలు తమను తాము నమోదుచేసుకున్నారు. వీరు రాష్ట్ర జనాభాలో 3.4 శాతంగా ఉండి, జనాభా పరంగా పదో పెద్ద వర్గంగా అవతరించారు. వీరి ప్రొఫైల్ పరిశీలిస్తే వీరంతా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నివసించే విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులని తేలింది.
ఐఏఎస్, ఐపీఎస్‌లాంటి ఉన్నత ఉద్యోగాల్లో వీరి ప్రాతినిధ్యం ఏకంగా 22.9 శాతంగా ఉంది. సామాజికంగా వీరు వెనుకబడి లేకపోయినా, కుల గుర్తింపును వదులుకోవాలని కోరుకుంటున్నారు. కాగా, వీరిలో 43 శాతం మంది వద్ద ఇంకా కుల ధ్రువీకరణ పత్రాలు ఉండటం, రిజర్వేషన్లు పొందుతుండడం గమనార్హం. ఇది సమాజంలో వస్తున్న మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.
వెనుకబడిన
- తరగతులు (బీసీ)56.4%
- షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.4%
- షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.4 %
- ఇతర కులాలు (ఓసీ/జనరల్) 11.9%

