V6 News

ప్రోరేటా ?.. జనాభా ? లోక్‌‌‌‌సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం

ప్రోరేటా ?.. జనాభా ? లోక్‌‌‌‌సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం
  • ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9
  • 2011 సెన్సస్ ప్రకారం 7 నుంచి 8.. తేడా ఒకటి నుంచి 2 సీట్లే
  • ఇప్పుడున్న సీట్లను 50 శాతం పెంచేందుకు కేంద్రం కసరత్తు
  • అందులో ఏ రాష్ట్రానికి ఎంత? అనే విషయంలో గందరగోళం
  • హడావుడి డీలిమిటేషన్‌‌‌‌కు నో అంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు
  • వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు 
  • నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోయే ‘డీలిమిటేషన్’ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. లోక్‌‌‌‌సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచుతామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిస్తున్న తరుణంలో.. ఆ పెంపు ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది  ప్రశ్నగా మారింది. గురువారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది.  అసలు సీట్లను పెంచేది ఏ లెక్కల ప్రకారం? ‘ప్రోరేటా’ పద్ధతినా? లేక ‘జనాభా’ ప్రాతిపదికనా?.. ఈ లెక్కే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల భవితవ్యాన్ని తేల్చనున్నది. అసలు వివాదమంతా ప్రాతిపదిక దగ్గరే మొదలైంది.

జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందనేది దక్షిణాది రాష్ట్రాల సీఎంల ఆందోళన. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించి, అభివృద్ధిని కాంక్షించిన దక్షిణాదికి సీట్లు తగ్గించడం అంటే.. క్రమశిక్షణకు శిక్ష వేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల పెంపు పేరుతో హడావుడిగా నియోజకవర్గాలను విభజించి, రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం చూస్తున్నదని ఇండియా కూటమి మండిపడుతున్నది.

3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు..
బడ్జెట్ సెషన్ కొనసాగింపులో భాగంగా గురువారం నుంచి మూడ్రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు భేటీ కానున్నాయి. పేరుకు బడ్జెట్ సెషన్‌‌‌‌గా పిలుస్తున్నా.. ఈ సెషన్ దేశ ముఖ చిత్రంతోపాటు మహిళా రిజర్వేషన్లను డిసైడ్ చేయబోతున్నాయి. ఈ సెషన్​లో ప్రస్తుతం ఉన్న లోక్‌‌‌‌సభ స్థానాలను 543 నుంచి గరిష్టంగా 850 (రాష్ట్రాల్లో 815, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35) పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, డీలిమిటేషన్​లో  ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? జనాభా ప్రాతిపదికన వెళ్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గందరగోళం మధ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై యుద్ధానికి ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలతో సిద్ధమయ్యాయి.

నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు.. అది దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతంగా మారుతున్నదని ఇండియా కూటమి ఆరోపిస్తున్నది. కానీ, కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదు. స్పష్టతనివ్వడం లేదు. ఇప్పుడు.. కేంద్రం ఇచ్చే ఆ ‘స్పష్టత’ కోసమే దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది.  1971లో చివరిసారిగా జరిగిన డీలిమిటేషన్ విధానం, 2011 నాటి లెక్కల ఆధారంగా లోక్ సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

తెలంగాణలో ఒకటి, రెండు సీట్లే తేడా
కేంద్రం యోచిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే.. తెలంగాణ లాంటి రాష్ట్రాలకు సీట్ల పెంపులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తున్నది. ఒకవేళ ప్రోరేటా పద్ధతిని ప్రామాణికంగా తీసుకుంటే.. తెలంగాణలో అదనంగా పెరిగే సీట్ల సంఖ్య 8 నుంచి 9 వరకు ఉండవచ్చు. అలా కాకుండా, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సంఖ్య 7 నుంచి 8కి పరిమితమయ్యే అవకాశం ఉంది. పైకి ఇది కేవలం ఒకటి లేదా రెండు సీట్ల తేడాగా కనిపిస్తున్నప్పటికీ, పార్లమెంట్‌‌‌‌లో రాష్ట్రం గళం, ప్రాతినిధ్యం విషయంలో కీలక పాత్ర పోషించనున్నది.

ప్రోరేటాతో పెద్దగా తేడా ఉండదు..
ఆర్టికల్81(1) ప్రకారం..  ఇప్పటివరకూ ఉన్న 550 లోక్‌‌‌‌సభ సీట్లలో దక్షిణాది 5 రాష్ట్రాల వాటా 129 సీట్లు(23.4%). పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య 850కి  చేరుతుంది. ఒకవేళ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన అదనపు సీట్లు కేటాయిస్తే దక్షిణాది సీట్లు173కి చేరుతాయి. అప్పుడు  సౌత్ వాటా 20.3 శాతానికి తగ్గిపోతుంది. అలాకాకుండా ప్రోరేటా ప్రకారం రాష్ట్రాలకు అదనపు సీట్లు కేటాయిస్తే అప్పుడు  195 సీట్లతో సౌత్ స్టేట్స్ వాటా 23 శాతానికి చేరుతుంది. అంటే ప్రోరేటా ప్రకారం వెళ్తే  దక్షిణాది  వాటాలో పెద్దగా తేడా ఉండదని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెబుతున్నారు.

కేంద్రం ఆలోచన ఏంటి ?
గతంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని ఎప్పటినుంచి అమలు చేయాలన్న విషయంలో 131 రాజ్యాంగ సవరణ బిల్లును సభలో కేంద్రం  ప్రవేశపెట్టనున్నది.  ఇందులో ఆర్టికల్ 334 (ఏ)ను సవరిస్తూ.. 2026 జనాభా లెక్కల తర్వాత జరిగే డీలిమిటేషన్ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే నిబంధనను తాజా  డీలిమిటేషన్ తో అమలయ్యేలా మార్చింది. అలాగే, రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు కూడా తాజా డీలిమిటేన్‌‌‌‌ను ప్రామాణికంగా పేర్కొన్నది. అంతేకాకుండా ఆర్టికల్ 81 ని సవరిస్తూ.. ప్రస్తుతం లోక్ సభ సీట్ల సంఖ్యను 850 కి పెంచనున్నది. 

అలాగే డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మరో రెండు బిల్లులను తీసుకురానున్నది. మహిళా రిజర్వేషన్లకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా.. అసలు సమస్య 850 సీట్ల పెంపు, డీలిమిటేషన్ దగ్గరే మొదలైంది. మహిళా రిజర్వేషన్లతోపాటు సీట్ల పెంపును ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి, సీట్ల పెంపును వ్యతిరేకించినా 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. మహిళల వ్యతిరేకి అని తమపై అధికార బీజేపీ ముద్ర వేయడంతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రాజ్యాంగ సవరణకు బలమెంత ?
ప్రస్తుతం ఉభయ సభలో ఎన్డీయే కూటమికి కావాల్సిన సంఖ్యా బలం ఉంది. లోక్ సభలో 292, రాజ్యసభలో 139 మంది సభ్యులున్నారు. దీంతో  కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందేందుకు సాధారణ మెజార్టీ(1/3) చాలని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందడం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే, 131 రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 (363 మంది) ఎంపీల బలం కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సవరణ ఆమోదం పొందేందుకు మరో 71 మంది మద్దతు ఎలా కూడబెడతారనేది ఉత్కంఠంగా మారింది. ఇది సాధ్యంకాదు కాబట్టే.. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రతిపక్షాలను ఎన్నికల ముందు బద్నాం చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు భావిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. 

ఎందుకు యూటర్న్?
2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని 2021  ఆగస్టులో నాటి పీసీసీ చీఫ్, ఎంపీ.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ పార్లమెంట్ వేదికగా సమాధానం ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 లోని అంశాన్ని ప్రస్తావిస్తూ.. 2026 జనాభా లెక్కల ఆధారంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153 కు పెంచుతామని పేర్కొన్నది.  ఇదే అంశాన్ని అనేకమార్లు లోక్‌‌‌‌సభ, రాజ్య సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం  వెల్లడించింది. అంతే కాకుండా ఇప్పటికే 2026 జన గణనలో కుల గణనను చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే.. ఇదంతా సవ్యంగా సాగుతోన్న వేళ సడెన్‌‌‌‌గా ఈ మూడు రోజుల పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, లోక్ సభ స్థానాల పెంపు తీసుకురావడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 

కేంద్రం చెబుతున్నట్టు ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసినా.. 2029 ఎన్నికల్లోనే ఈ రిజర్వేషన్లు అమలయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా  ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగానే అప్పటి మహిళా రిజర్వేషన్లు అమలు అవుతాయనేది స్పష్టమైన విషయం. మరి ఉన్నఫలంగా మహిళా రిజర్వేషన్ల బిల్లును.. సీట్ల పెంపుతో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ చేసేకన్నా ప్రస్తుతం ఉన్న 543లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు(181) కల్పిస్తే సరిపోతుందనేది ప్రతిపక్షాల వాదన.