హైదరాబాద్, వెలుగు: 24 గంటల్లో విధుల్లో చేరాలని సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు ట్రాన్స్కో బుధవారం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే పర్మినెంట్గా తొలగిస్తామని హెచ్చరించింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ట్రాన్స్కో, జెన్కో, ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన 19 వేల మందికి పైగా ఆర్టిజన్లు ఈ నెల 9 నుంచి సమ్మె చేస్తున్నారు.
ఈ క్రమంలో సమ్మె విరమించాలని ఇదివరకే జెన్కో సంస్థ ఎస్మా ఉత్తర్వులు జారీ చేయగా.. తాజాగా ట్రాన్స్కో నుంచి ఇలాంటి ఉత్తర్వులే వెలువడ్డాయి. ఫిబ్రవరి 25 నుంచి ఆగస్టు 24 వరకు ఆరు నెలల పాటు విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులెవరూ సమ్మె చేయకూడదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని.. అయినా, వాటిని ధిక్కరించి సమ్మె చేయడం చట్ట విరుద్ధమని తెలిపాయి. గురువారం అందరూ విధుల్లో విధుల్లో చేరాలని ట్రాన్స్కో ఆదేశించింది.

