V6 News

ఆషాఢం సేల్స్లా కాంగ్రెస్‌‌‌‌ హామీలు! : కేటీఆర్

ఆషాఢం సేల్స్లా కాంగ్రెస్‌‌‌‌ హామీలు! : కేటీఆర్
  •     ఆరు గ్యారంటీలకు 30 నెలలైనా దిక్కులేదు: కేటీఆర్
  •     హైదరాబాద్‌‌‌‌లో దొంగలు, దోమలే ఖుషీగున్నయని ఎద్దేవా  
  •     దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తే కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడుతామని వెల్లడి

మేడిపల్లి, వెలుగు: ‘‘అత్తకు నాలువేలు, కోడలికి రెండున్నర వేలు ఇస్తం..”అని ఎన్నకలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆషాఢం సేల్స్​లా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్​అయ్యారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నీటి ముటలుగా మారాయని విమర్శించారు. బుధవారం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో జరిగిన పార్టీ కార్యకర్తల మీటింగ్‌‌‌‌లో కేటీఆర్, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్ కౌడె పోచయ్య, విద్యా, సామాజిక వేత్త ఆకుల మధుకర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్‌‌‌‌పై నిప్పులు చెరిగారు. ఇస్తామన్న స్కూటీలు ఎక్కడ? మహిళలకు రావాల్సిన నగదు ఎక్కడ?" అని ప్రశ్నించారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి రాగానే నిలువునా వంచించారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని మండిపడ్డారు.  

‘‘టైం అడిగితే ముగ్గురు మొగాళ్లు కలిసి మూడు నెలల్లో పిల్లలను కనలేరు”అంటూ సీఎం వెటకారం మాట్లాడుతున్నారని,  ఇప్పుడు 30 నెలలవుతున్నా ఏ పురోగతి లేకపోవడాన్ని ఏమనాలని నిలదీశారు. గతంలో తల్లి బిడ్డ క్షేమం కోసం రూ.13 వేలతోపాటు  కేసీఆర్ కిట్ ఇచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్​ఇచ్చేది సున్నా.. చేసేది వెటకారమని దుయ్యబట్టారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్​ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.  "నిజం చెప్పాలంటే హైదరాబాద్​లో ఇప్పుడు ఇద్దరే ఫుల్ ఖుషీగా ఉన్నరు.. ఒకరు దొంగలు, ఇంకొకరు దోమలు. గల్లీ గల్లీలో దోమలు దండయాత్ర చేస్తున్నయ్’’ అని ఎద్దేవా చేశారు. 

ఒకవైపు దోమలు రక్తం తాగుతుంటే, ఇంకోవైపు ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అండతో కొందరు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.   కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉప్పల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎనిమిదేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు.  ఇక సీట్ల పునర్విభజన (డీ లిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కితే కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా క్లీన్ స్వీప్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాబోయే ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.