- గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్య
- మంచి పుస్తకాలే వ్యక్తిత్వ వికాసానికి పునాదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతి కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించే నిజమైన సీఈవో అమ్మే అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రచయిత భోగాడి ఉదయమూర్తి రచించిన ‘ది సీఈవో షీ నెవర్ న్యూ షీ వాజ్’ పుస్తకం సమాజానికి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ఆలోచనను ముందుకు తెచ్చిందని కొనియాడారు. రాజ్ భవన్‌లోని ‘సంస్కృతి’ కమ్యూనిటీ హాల్‌లో శనివారం నిర్వహించిన ‘ది సీఈవో షీ నెవర్ న్యూ షీ వాజ్’ పుస్తకావిష్కరణ, హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పుస్తకాల పఠనం వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనల పరిపక్వతకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ‘పుస్తకం చేతికి అలంకారం’ అనే భావనను ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, యువత తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను వివేకంతో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువతలో పుస్తక పఠన సంస్కృతి పెంపొందితే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఈ పుస్తకం పాఠకులను ఆలోచింపజేసే రచనగా ఉదయమూర్తి నిలవాలని, రచయితకు మరిన్ని విలువైన గ్రంథాలు రాసేందుకు ఇది ప్రేరణ కల్పించాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 16 మందికి గవర్నర్ అవార్డులను అందజేశారు.
