హైదరాబాద్, వెలుగు: మానవ సేవే జీవిత పరమార్థంగా భావించాలని గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ బ్రాంచి ఆధ్వర్యంలో శుక్రవారం లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ ఫొటోకు గవర్నర్ నివాళి అర్పించి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మానవత్వంలో ఐక్యత అనేది ఈ ఏడాది థీమ్ అని.. ఇది సమాజంలో బాధలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోందన్నారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీకి కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కృష్ణసాయి రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి చెక్కును గవర్నర్కు అందజేశారు.
