V6 News

ఏప్రిల్ 23న వర్సిటీల వీసీలతో గవర్నర్ భేటీ

ఏప్రిల్ 23న వర్సిటీల వీసీలతో గవర్నర్ భేటీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని యునివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో (వీసీలు) గవర్నర్ భేటీ కానున్నారు. ఛాన్సలర్ హోదాలో ఆయన యూనివర్సిటీల పనితీరు, ఉన్నత విద్యా వ్యవస్థ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ  మీటింగ్​కు ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ యునివర్సిటీతో సహా రాష్ట్రంలోని మొత్తం 16 ప్రభుత్వ వర్సిటీల వీసీలు హాజరుకానున్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా, వచ్చే గురువారం జరిగే సమావేశం గురించి వర్సిటీ వీసీలకు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి లేఖ రాశారు. వర్సిటీల వారీగా చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను త్వరలోనే విడిగా పంపుతామని లేఖలో పేర్కొన్నారు. వీసీలు తమ వర్సిటీల ప్రగతి, విద్యా ప్రమాణాలు, పరిపాలనలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక సంక్షిప్త నివేదికను సిద్ధం చేసుకుని రావాలని సూచించారు.