మల్టీ స్పెషల్ హాస్పిటళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

మల్టీ స్పెషల్ హాస్పిటళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

రాష్ట్రంలో వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తున్న సీఎం కేసీఆర్.. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. గచ్చిబౌలిలో ఇప్పటికే టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయగా.. తాజాగా ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి  ప్రభుత్వం రూ.2679 కోట్లు కేటాయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వరంలో ఈ  మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఏర్పాటు కానున్నాయి. 

రూ.900 కోట్లతో ఎల్బీనగర్, రూ.882 కోట్లతో సనత్ నగర్, రూ.897 కోట్లతో అల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తూ జీవో నెంబర్ 41 జారీ చేశారు. బిల్డింగుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. ఈ మూడు హాస్పిటళ్లు స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గనుంది.