- సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తున్నది
- లోక్‌సభలో కేంద్ర మంత్రి కిరణ్‌రిజిజు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు (జమిలి) నిర్వహించాలనే అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో లా కమిషన్ చర్చించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ తన రిపోర్టులో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని తెలిపారు. ఆ రిపోర్టు ఆధారంగా లా కమిషన్ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను స్టడీ చేస్తూ రోడ్ మ్యాప్ తయారుచేసే పనిలో ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సర్వీసులు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన రిపోర్ట్‌లో పేర్కొందన్నారు. పార్లమెంట్‌కు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపారు. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, వీటి నిర్వహణకు రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని సమాధానంలో వివరించారు.
