
హైదరాబాద్, వెలుగు : సర్కారు దవాఖాన్లలో ఈవినింగ్ ఓపీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని గవర్నమెంట్ టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో సోమవారం నల్లబ్యాడ్జీలు పెట్టుకుని డ్యూటీలు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం రోజూ ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకూ ఓపీ చూస్తున్నామని, మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు 9 గంటల వరకు డ్యూ టీ డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జలగం తిరుపతిరావు అన్నారు. కొత్తగా ఈవినింగ్ ఓపీతో జనాలకు ఒరిగేదేమీ లేదన్నారు. తమకు యూజీసీ స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వట్లేదని, 56 నెలల పీఆర్‌సీ బకాయిలు రాలేదని, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వట్లేదని, పైగా జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ అడిగితే ఈవినింగ్ ఓపీ పేరిట తమను మరింత ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈవినింగ్ ఓపీ ఎన్‌ఎంసీ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు.