- భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామపంచాయతీ తీర్మానం
ఇల్లెందు, వెలుగు: గ్రామాభివృద్ధి, యువత భవిష్యత్తును కాపాడడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ సనప సావిత్రి, పాలకవర్గ సభ్యులు నాటుసారాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో గుడుంబాను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో కల్తీ సారాకు యువకులు, విద్యార్థులు బానిసలై లివర్, కిడ్నీలు చెడిపోయి చిన్న వయసులోనే చనిపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ధనియాలపాడు గ్రామపంచాయతీ పరిధిలో సారాయి తయారు చేసినా, అమ్మినా, తాగి పట్టుబడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.
వారిపై పోలీస్, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సారాయి కాస్తున్న వారిపై పంచాయతీ నిరంతరం నిఘా ఉంచుతుందని, గ్రామంలోని పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వారిపై కఠినచర్యలు తీసుకోవడంలో వెనకాడబోమని స్పష్టం చేశారు. రేషన్, పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని, భారీ జరిమానా, ఇండ్ల జప్తు చేస్తామని తెలిపారు. సారాయి తయారు చేసినా, అమ్మినా సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. గ్రామస్తులంతా ఈ తీర్మానానికి కట్టుబడి ఉండి సహకరించాలని కోరారు. అనంతరం గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

