ఇంటిపన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ స్వాధీనం

ఇంటిపన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ స్వాధీనం

వరంగల్, వెలుగు: ఇంటి పన్ను బకాయిల కారణంగా మున్సిపల్ సిబ్బంది ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌‌ను సీజ్​ చేసిన ఘటన గ్రేటర్ వరంగల్‌‌లో మంగళవారం జరిగింది. జీడబ్ల్యూఎంసీ వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో సుజాత అనే ఇంటి యజమానికి రూ.6,504 ఇంటి పన్ను బకాయి ఉంది. ఫిబ్రవరి 23న వసూళ్ల కోసం వచ్చిన సిబ్బంది రెండు మూడు రోజుల్లో పన్ను చెల్లించాలని, లేదంటే అత్యవసర సేవలను నిలిపివేస్తామని రెడ్ నోటీసులు ఇచ్చారు.

మంగళవారం మళ్లీ ఇంటికి వచ్చిన ఆర్‌‌ఐ స్థాయి అధికారులు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌‌ను బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మున్సిపల్ ఆర్‌‌ఐ సోహైల్ స్పందిస్తూ, పలుమార్లు పన్ను చెల్లించాలని చెప్పినా యజమానులు స్పందించలేదన్నారు. మూడు వారాల క్రితమే రెడ్ నోటీసులు ఇచ్చామని, చివరకు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తామని చెప్పడంతో యజమాని పన్ను చెల్లించినట్లు తెలిపారు.