అడుగంటిన భూగర్భజలాలు..గత నెలతో పోలిస్తే 1.77 మీటర్లు పడిపోయిన నీళ్లు

అడుగంటిన భూగర్భజలాలు..గత నెలతో పోలిస్తే 1.77 మీటర్లు పడిపోయిన నీళ్లు
  • మండుతున్న ఎండలు.. ఎండుతున్న వాగులు, చెరువులు
  • వచ్చే రెండు నెలలు మరింత పడిపోయే ప్రమాదం

ఆదిలాబాద్, వెలుగు: భూగర్బజలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఎండలు తీవ్రమవుతుండటంతో చెరువులు, వాగులు, బావుల్లో నీటి మట్టం తగ్గుతోంది. గత ఫిబ్రవరితో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో రెండు మీటర్లు లోతులోకి నీళ్లు పడిపోయాయి. నిరుటికన్నా పరిస్థితి దారుణంగా మారింది. ఏప్రిల్, మే నెలల్లో మరింత నీటి ఎద్దడి తీప్రమయ్యే ప్రమాదం ఉందని గ్రౌండ్​వాటర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండడంతో ప్రజలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాటర్ లెవల్ మరింత తగ్గి నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రతి నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భూగర్భజల శాఖ అధికారులు ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను నిర్ధారిస్తారు. ఈ క్రమంలో మార్చిలో కొలిచిన నీటి లభ్యత రిపోర్టను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయినట్లు వెల్లడించారు.   

రోజురోజుకు కిందకు..

జిల్లాలో ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే భూగర్భ జల మట్టం 1.77 మీటర్ల లోతుకు పడిపోయింది. ఫిబ్రవరిలో 5.28 మీటర్ల దగ్గరున్న నీళ్లు మార్చి నెల చివరి నాటికి 7.05 మీటర్లకు తగ్గిపోయాయి. మరో రెండు నెలల్లో ఇంకా 3 మీటర్ల లోతుకు వెళతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ లో ఫిబ్రవరిలో 8.80 మీటర్ల లోతులో ఉన్న నీళ్లు మార్చిలో 10.34 లోతుకు చేరాయి. బోరజ్, గాదిగూడ, ఉట్నూర్, బజార్ హత్నూర్, నార్నూర్ మండలాల్లో రోజురోజుకు పడిపోతున్నాయి. 

ప్రజలు, రైతుల్లో ఆందోళన

ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు లాండసాంగ్వి వాగు నుంచి వచ్చే నీరు పూర్తిగా ఎండిపోవడంతో వాగులో జేసీబీతో తవ్వించి నీళ్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మావల చెరువు నుంచి వచ్చే నీటిని ఫిల్టర్ బెడ్ ద్వారా సరఫరా చేస్తుండగా ఆ చెరువులో నీరు తగ్గుతోంది. జిల్లాలోని చాలా మంది రైతులు బోరుబావులతో పాటు, చెరువుల ద్వారా పంటలకు నీళ్లు అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అండుగంటిపోవడం వల్ల చెరువులు, బావుల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండడంతో ప్రజలు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

పొదుపుగా వాడుకోవాలి

జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎండ తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్,  మే నెల్లో మరింత ప్రమాద స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. వృథా చేయొద్దు. నీటి గుంటల్లాంటి ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.  -శ్రీవల్లి, భూగర్భ జల శాఖ ఏడీ