సమ్మెలో ఆర్టిజన్ కార్మికులు.. సమస్యల్లో వినియోగదారులు

సమ్మెలో ఆర్టిజన్ కార్మికులు..  సమస్యల్లో వినియోగదారులు
  • 19 వేలకు పైగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు సమ్మె బాట
  •      సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్
  •     పలుచోట్ల - విద్యుత్ ​సరఫరాకు అంతరాయం 
  •     స్తంభించిన కొత్త మీటర్ల జారీ, కనెక్షన్లు, లైన్ల పునరుద్ధరణ
  •     సమ్మె ఇలాగే కొనసాగితే తీవ్రం కానున్న కరెంట్​ ప్రాబ్లమ్స్
  •     ఎస్మా ప్రయోగిస్తున్న జెన్​కో
  •     చెల్పూర్​ కేటీపీపీలో 800 మంది ఆర్టిజన్లకు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ​శాఖలో పనిచేస్తున్న 19 వేల మందికి పైగా ఆర్టిజన్​ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్​ ఉత్పత్తి, సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే  పరిష్కరించేవారే  కరువయ్యారు. కనీసం కరెంట్​ పోల్ ఎక్కే దిక్కులేకుండా పోయింది. సబ్​స్టేషన్లు, విద్యుత్​ లైన్లు ఖరాబైతే బాగు చేసే పరిస్థితి లేదు. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్క గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 4వేల మందికిపైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె నేపథ్యంలో 33/11 కేవీ సబ్​స్టేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ విద్యుత్​ సరఫరాలో వివిధ చోట్ల ఇబ్బందులు తప్పడంలేదు. 

విద్యుత్​సరఫరాలో సమస్యలకు తోడు కొత్త మీటర్ల జారీ, కనెక్షన్లు, లైన్ల పునరుద్ధరణ వంటి పనులు స్తంభించిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. సమ్మె వల్ల విధులకు గైర్హాజరవుతున్న వేలాది మంది కార్మికులపై జెన్​కో యాజమాన్యం ఎస్మా ప్రయోగిస్తోంది. గురువారం అర్ధరాత్రి చెల్పూర్​ కేటీపీపీలో పనిచేసే 800 మంది కార్మికులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా జాబ్​ నుంచి తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా కార్మిక సంఘాల నేతలు తెలిపారు. 

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..

రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలోని ట్రాన్స్​కో, జెన్​కో, ఎస్​పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్​సంస్థల పరిధిలో 19,447 మంది ఆర్టిజన్​ కార్మికులు కాంట్రాక్ట్​ పద్ధతిలో పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా సమాన పనికి సమాన వేతనం డిమాండ్ ​చేస్తున్నారు. విద్యార్హతల ఆధారంగా ప్రమోషన్ ఇవ్వాలని, అన్​ మ్యాన్డ్, మీటర్ రీడర్లు, పీస్ రేట్ కార్మికులను ఆర్టిజన్​ కార్మికులుగా గుర్తించాలన్నారు. 

విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కన్నా ముందు అన్ని అర్హతలు ఉండి, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు, 2026 పీఆర్సీ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి విధులు బహిష్కరించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఈ) ఆధ్వర్యంలో హైదరాబాద్​ లోని విద్యుత్​ సౌదా, మింట్​ కౌంపౌండ్​లోని ప్రధాన కార్యాలయాలతో పాటు జిల్లా, డివిజన్, మండల కేంద్రాలు, సబ్​ స్టేషన్లు, ఇతర ఆఫీసుల ముందు నిరవధిక నిరసన దీక్షలు, ధర్నాలు, వంటావార్పు చేపడుతున్నారు.

డ్యూటీల్లో జూనియర్​ లైన్​మెన్లు, లైన్​ మెన్లు 

ఆర్టిజన్​ కార్మికుల సమ్మెతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద జూనియర్​ లైన్​మెన్లు, లైన్​మెన్లకు ఉన్నతాధికారులు డ్యూటీలు వేశారు. విద్యుత్​సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ, వ్యవసాయ ఫీడర్లు, గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ ఫార్మర్లు, కరెంట్​ పోల్స్​ వద్ద సమస్యలు వచ్చినా.. కరెంట్​ వైర్లు తెగిపడినా అక్కడికి వీళ్లు వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

నిజానికి  జూనియర్​ లైన్​మెన్లు,  లైన్​మెన్లలో 90 శాతం మందికి కరెంట్​ పోల్స్​ ఎక్కడం రాదని అధికారులు చెప్తున్నారు. ఈ పనులన్నింటినీ లైన్​మెన్లు.. ఆర్టిజన్​కార్మికులతో చేయించేవారు. వారు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పెరుగుతున్నాయి. మరోవైపు కార్మికుల సమ్మె కారణంగా ఈ నెల కరెంట్​ మీటర్​ రీడింగ్ పెండింగ్ పడినట్టు చెప్తున్నారు.  

సమ్మెలో పాల్గొనకూడదని హెచ్చరికలు 

కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిన ఉన్నతాధికారులు అది వదిలి తాము సమ్మెలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆర్టిజన్​ కార్మికులు ఆరోపిస్తున్నారు. జెన్​కో యాజమాన్యం ఏకంగా ఎస్మా ప్రయోగిస్తూ కార్మికులకు నోటీసులు పంపించి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ, మూడో రోజు శుక్రవారం 90 శాతానికి పైగా ఆర్టిజన్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నట్టు జేఏసీ నాయకులు ప్రకటించారు. 

తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చివరికి నోటీసులు ఇచ్చి, సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి వెళ్లినందున ఒకటి, రెండు రోజుల్లో చర్చలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

విద్యుత్​ శాఖలో  పనిచేస్తున్న ఆర్టిజన్స్,  

కంపెనీ పేరు             కార్మికులు  
జెన్​కో                          3,608
ట్రాన్స్​కో                     3,774
ఎస్​పీడీసీఎల్            8,595
ఎన్​పీడీసీఎల్​            3,470
మొత్తం కార్మికులు    19,447