- 464 ఏఈఈ, 92 ఏఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- మల్టీజోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడి.. భర్తీ కోసం ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం (పీఆర్ఈడీ)లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఏండ్లుగా నోటిఫికేషన్లకు మోక్షం కలగకపోవడంతో ఏఈఈ, ఏఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తాజాగా 618 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. అవి ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉంది. శాఖలో మొత్తం 1,375 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 799 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
అంటే దాదాపు 42 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 576 ఖాళీలకు తోడు 2026 నాటికి రిటైర్ అయ్యే మరో 42 మందిని కలుపుకొని మొత్తం 618 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. ఖాళీల కారణంగా ఉన్న కొద్దిమంది సిబ్బందిపై పనిభారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండు, మూడు మండలాలకు ఒకే ఇంజినీర్ ఇన్‌చార్జిగా వ్యవహరించాల్సి రావడంతో పనుల నాణ్యతపై ప్రభావం పడుతున్నదని అంటున్నారు.
464 ఏఈఈ పోస్టులు ఖాళీ
శాఖలో ఖాళీలు ఉండటంతో 402 ఏఈఈ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు పంపించారు. తాజాగా.. మరో 62 ఏఈఈ పోస్టులు ఖాళీ కావడంతో వాటిని కలిపి మొత్తం 464 ఖాళీలు ఉన్నాయని నివేదికలు పంపారు. ఇందులో మల్టీజోన్-–1లో 260, మల్టీజోన్-–2లో 204 ఏఈఈ ఖాళీలు ఉన్నాయి. అలాగే, మొత్తం 154 ఏఈ పోస్టుల్లో 92 పోస్టులు ప్రత్యక్ష నియామకాల ద్వారా.. 62 పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రత్యక్ష నియామకాల్లో మల్టీజోన్-–1లో 52, మల్టీజోన్–-2లో 40 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అయితే, ఏఈ పోస్టుల భర్తీకి కూడా ఏండ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. కాగా, ఇంజినీర్ల కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, భవనాల మెయింటెనెన్స్, తాగునీటి పథకాలు కుంటుపడుతున్నాయని అధికారులు అంటున్నారు. పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొంటున్నారు. పోస్టులు భర్తీ చేయకుండా ప్రమోషన్లతో నెట్టుకొద్దామని చూస్తున్నా.. అవి కూడా న్యాయపరమైన చిక్కులతో సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
