
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జాం సందర్భంగా మూడు సెంటర్లలో క్వశ్చన్ పేపర్లు తారుమారయ్యాయి. దీంతో 69 మంది అభ్యర్థులకు అడిషనల్ టైమ్ ఇచ్చి, అధికారులు వారితో పరీక్ష రాయించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే గ్రూప్1 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్ల తప్పిందంతోనే క్వశ్చన్ పేపర్లు తారుమారయ్యాని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అమోయ్ కుమార్ వెల్లడించారు.
టైం అయిపోయినంక ఎగ్జాం పెట్టిన్రు
హైదరాబాద్‌లో ఈ నెల16న మొత్తం106 సెంటర్లలో గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జాం జరిగింది. ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకూ పరీక్ష నిర్వహించారు. కానీ నగరంలోని మారెడ్‌పల్లి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్(ఎస్ఎఫ్ఎస్), అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో ఆలస్యంగా పరీక్షలు జరిగాయి. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏకంగా పరీక్షా టైమ్ పూర్తయిన తర్వాత 1 గంటకు పరీక్ష ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు, అభ్యర్థుల కథనం ప్రకారం.. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోని మూడు రూముల్లో 47 మంది అభ్యర్థులకు ఇంగ్లీష్/తెలుగు క్వశ్చన్ పేపర్లకు బదులు ఇంగ్లీష్ /నాన్ తెలుగు లాంగ్వేజీ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. విషయం గుర్తించిన వెంటనే ఇంగ్లీష్/తెలుగు మీడియం పేపర్లను అందించారు. అయితే, ఓఎంఆర్ షీట్లు చెల్లుబాటు కావనే ఆందోళనతో క్వశ్చన్ పేర్లు అక్కడే పెట్టి అభ్యర్థులు రూమ్ బయటకు వచ్చి ధర్నాకు దిగారు. అధికారులు సముదాయించినా వినకపోవడంతో, చివరికి జిల్లా కలెక్టర్ వచ్చి చర్చించారు. దీంతో వారు పరీక్ష రాసేందుకు ఒప్పుకున్నారు. ఈ 47మందికి మధ్యాహ్నం 1 నుంచి 3.30 వరకూ పరీక్ష నిర్వహించారు. అయితే, ఎగ్జాంకు ముందు రెండున్నర గంటల పాటు ఏం జరిగిందనే దానిపైనే అందరిలో అయోమయం నెలకొన్నది.
విచారణ తర్వాతే నిర్ణయం
మూడు సెంటర్లలో జరిగిన పొరపాట్లపై సమగ్ర విచారణ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ప్రత్యేక కమిటీ వేసి మూడు సెంటర్లలో జరిగిన లోపాలపై ఎంక్వైరీ చేయనున్నది. విచారణ ఆధారంగా మేనేజ్మెంట్లతో పాటు పరీక్షా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘‘పరీక్షా టైమ్ పూర్తయ్యే వరకూ అభ్యర్థులు లోపలే ఉన్నారు. బయటకు వెళ్లలేదు. పేపర్లు కూడా వారి దగ్గర లేవు. అవకతవకలు జరిగే అవకాశం లేదు. ప్రైమరీ ఎంక్వైరీలో మాస్ కాపీయింగ్ జరగలేదని గుర్తించాం. కొందరి నిర్లక్ష్యంతోనే పేపర్లు తారుమారైనట్టు తెలిసింది. సమగ్ర విచారణ తర్వాతే ఆ 47 మంది పేపర్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన వెల్లడించారు.
మరో రెండు సెంటర్లలో..
అబిడ్స్ లోని మరో రెండు సెంటర్లలో కూడా గ్రూప్–1పరీక్ష కొంత ఆలస్యంగా జరిగింది. అబిడ్స్ లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్ లో కూడా ఇంగ్లీష్/తెలుగు క్వశ్చన్ పేపర్ కు బదులు.. ఇంగ్లీష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ పేపర్ ఇచ్చారు. దీంతో ఇద్దరికి 15 నిమిషాలు, ఐదుగురికి 30 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇదే ఏరియాలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లోనూ15 మందికి 7 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చినట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు కోల్పోయిన సమయాన్ని వారికి కేటాయించామని, అంతే తప్ప గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి తప్పులు జరగలేదని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఆలస్యానికి కారణమైన ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ధర్నా చేసిన అభ్యర్థులపై కేసులు?
ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో ఆందోళనకు దిగిన కొంతమంది అభ్యర్థులపై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఇతరులను తప్పుదోవ పట్టించడం, పరీక్ష కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఆందోళనలో పోలీస్ శాఖకు చెందిన వ్యక్తే కీలకంగా వ్యవహరించినట్టుగా అధికారులు గుర్తించినట్టు తెలిసింది.