యూనియన్ల కోసం పెరుగుతున్న డిమాండ్లు

యూనియన్ల కోసం పెరుగుతున్న డిమాండ్లు

నామ్​కే వాస్త్​గా మారిన వెల్ఫేర్ కమిటీలు
సమస్యలు, వేధింపులతో  కార్మికులకు ఇబ్బందులు
టీఆర్ఎస్ అనుబంధ సంఘం నేతలతో మంత్రి చర్చలు
టీఎంయూకు లేబర్ కమిషనర్ సర్టిఫికెట్ 


హైదరాబాద్ : ఆర్టీసీలో యూనియన్లు తిరిగి స్టార్ట్ కానున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యూనియన్ల నేతలు.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్​ను కలిసి కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో యూనియన్ల పునరుద్దరణ ప్రధాన అంశంగా ఉంది. యూనియన్ల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అందుకు అంగీకరించినట్లు నేతల్లో చర్చ జరుగుతోంది. యూనియన్ నేతలతో హరీశ్ నిత్యం మాట్లాడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ టీఎంయూకు హరీశ్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. 2019 నవంబర్ లో ఆర్టీసీ సమ్మె టైమ్​లో యూనియన్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటి స్థానంలో ప్రతి డిపోలో ముగ్గురు, నలుగురు నేతలతో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ప్రతి డిపోలో  కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. యూనియన్లను కార్మికులు సంప్రదించకుండా వారి ప్రమేయంను తగ్గించడానికి సీఎం ఆదేశాలతో ఈ కమిటీలను ఆర్టీసీ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసింది. అయితే మూడేళ్లుగా వెల్ఫేర్ కమిటీల వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండడం లేదని కార్మికులు వాపోతున్నారు. వాటిని రద్దుచేసి యూనియన్లను రీస్టోర్  చేయాలని కోరుతున్నారు. 

టీఎంయూకు లేబర్ కమిషనర్ సర్టిఫికెట్

టీఎంయూ యూనియన్ వర్గాలుగా చీలింది. యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్న అశ్వత్థామమరెడ్డి సమ్మె  టైమ్ లో ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. తరువాత  ఆయనకు ఆర్టీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఉద్యోగానికి రిజైన్ చేసి బీజేపీలో చేరారు. ఆయన స్థానంలో నిర్మల్ కు చెందిన రాంచంద్రారెడ్డిని టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీఎంయూకి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఉన్న థామస్ రెడ్డి ఆ యూనియన్ నుంచి బయటకు వచ్చి టీఎంయూ పేరుతో చెలామణి అవుతున్నారు. పలుసార్లు ఎమ్మెల్సీ కవితను, ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ ను కలుస్తూ ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యారు. టీఎంయూ తమదే అని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. అయితే థామస్ రెడ్డి జనరల్ సెక్రటరీగా ఉన్న టీఎంయూకు ఇటీవల లేబర్ డిపార్ట్ మెంట్ కమిషనర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ సర్టిఫికెట్ ఇచ్చారని ఆర్టీసీలో చర్చ జరుగుతోంది. 

హైకోర్టుకు అశ్వత్థామ రెడ్డి వర్గం

థామస్ రెడ్డి వర్గానికి లేబర్ డిపార్ట్ మెంట్ కమిషనర్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అశ్వత్థామ రెడ్డి వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టీసీలో అసలు యూనియన్లే లేవని, టీఎంయూ తమదే అని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పిటిషన్ లో యూనియన్ నేతలు పేర్కొన్నారు. దీంతో లేబర్ కమిషనర్ సర్టిఫికెట్ పై హైకోర్టు స్టే విధించింది.  

ఆర్టీసీకి దూరం కావొద్దన్న ఆలోచనలో సీఎం

గత కొద్ది రోజులుగా థామస్ రెడ్డి వర్గం నేతలు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును కలిసి చర్చలు జరుపుతున్నారు. యూనియన్ల రీస్టోర్ కు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలుస్తోంది. వెల్ఫేర్ కమిటీలు సరిగ్గా పనిచేయకపోవడం, యూనియన్లను మళ్లీ తెరవాలని డిమాండ్లు పెరుగుతుండడంతో సీఎం సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఆర్టీసీలో 48 వేల మంది కార్మికులు ఉండడం, సమస్యలు పరిష్కారం చేయకపోవడంపై కార్మికులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. మునుగోడు  బైపోల్,  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ చైర్మన్ బాజిరెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు అధికార పార్టీకి చాలా కీలకం కావడం, రాష్ర్టంలో అన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో వాళ్ల ఓట్లు ఉండడంతో వారిని దూరం చేసుకోవద్దన్న భావనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పీఆర్సీని ప్రకటించే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.