వృద్ధి తగ్గింది, అయినా వేగంగా ఎదుగుతున్నాం

వృద్ధి తగ్గింది, అయినా వేగంగా ఎదుగుతున్నాం

ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం
పరిశ్రమలకు రాయితీలూ ఇస్తున్నాం
2025 నాటికి 5 లక్షల కోట్ల ఎకానమిగా ఎదుగుతాం
లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
అనురాగ్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీఆర్థిక వృద్ధి రేటు తగ్గిందని, కాకపోతే ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌‌ ఠాకూర్‌‌ లోక్‌‌సభలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెబుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మెర్జర్‌‌ కూడా అందులో భాగమేనని తెలిపారు. లోక్‌‌సభలో క్వశ్చన్‌‌ అవర్‌‌లో ఈ వివరాలు తెలియచేశారు. పరిశ్రమలకు రాయితీలూ కల్పిస్తున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థ కుంటి నడక నడుస్తోందనే ఆమ్‌‌ ఆద్‌‌మీ పార్టీ ఎంపీ భగవంత్‌‌ మాన్ వ్యాఖ్యకు, బదులిస్తూ, వృద్ధి రేటు 5 శాతం తగ్గిపోలేదని అనురాగ్‌‌ ఠాకూర్‌‌ చెప్పారు. చాలా దేశాలు స్లోడౌన్‌‌ ఎదుర్కొంటున్నప్పటికీ, ఇండియా ఇప్పటికీ వేగంగానే వృద్ధి చెందుతోందని తెలిపారు. 2025 నాటికి 5 లక్షల కోట్ల ఎకానమిగా మన దేశం అవతరిస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమలకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, ఎంఎస్‌‌ఎంఈలకు రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పెద్ద బ్యాంకులతో చాలా చిన్న బ్యాంకులను విలీనం చేశామని, భవిష్యత్‌‌లో నాలుగు పటిష్ఠమైన పెద్ద బ్యాంకులు మాత్రమే ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బ్లాక్‌‌మనీకి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపైందని పేర్కొన్నారు.

డీమానిటైజేషన్‌‌, జీఎస్‌‌టీల వల్లే పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపైందని అన్నారు. నేషనల్‌‌ స్టాటిస్టికల్‌‌ ఆఫీస్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఓ) లెక్కల ప్రకారం 2014–2019 మధ్యలో ఇండియా సగటు వృద్ధి 7.5 శాతమని, జీ–20 దేశాలలో చూస్తే ఇదే అత్యధికమని చెప్పారు. 2019 లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి, వ్యాపారం నెమ్మదిస్తాయని ఈ అక్టోబర్‌‌లో వరల్డ్‌‌ ఎకనమిక్‌‌ ఔట్‌‌లుక్‌‌ (డబ్ల్యూఈఓ) చేసిన ప్రకటనను ఠాకూర్‌‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటీవలి సంవత్సరాలలో  వృద్ధి రేటు తగ్గినప్పటికీ, జీ–20 దేశాలలో ఇండియానే 2019–20 లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని డబ్ల్యూఈఓ వెల్లడించిందన్నారు. దేశంలో పెట్టుబడులు , వినియోగం,  ఎగుమతులు పెరిగేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు గత అయిదేళ్లలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. 2016 లో తీసుకొచ్చిన ఇన్‌‌సాల్వెన్సీ అండ్‌‌ బ్యాంక్‌‌రప్టసీ కోడ్‌‌ (ఐబీసీ) దేశంలో పెద్ద మార్పని చెప్పారు.

ఫైనాన్షియల్‌‌ సిస్టమ్‌‌ క్లీన్‌‌ చేసేందుకే దానిని తెచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలో వ్యాపారం సులభతరం చేసే భాగంలోనే జీఎస్‌‌టీని అమలులోకి తెచ్చామన్నారు. దేశీయంగా వివిధ వస్తువుల తయారీకి మేకిన్‌‌ ఇండియా ప్రోగ్రామ్‌‌ అమలు చేస్తున్నట్లు ఠాకూర్‌‌ తెలిపారు. ఈ భారీ సంస్కరణల ఫలితంగానే విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలోనూ ప్రభుత్వం సఫలమైందని తెలిపారు. ద్రవ్య లోటును సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఠాకూర్‌‌ పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులకు ఊపు ఇచ్చేందుకు ఇటీవలే కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ను 22 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్తగా తయారీ యూనిట్లు పెట్టే దేశీయ కంపెనీలకైతే ఈ ట్యాక్స్‌‌ను 15 శాతానికే పరిమితం చేశామని, ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత తక్కువ లేదని పేర్కొన్నారు.