
- బొల్లంపల్లిలో గెస్ట్ లెక్చరర్అంత్యక్రియల్లో పాల్గొన్న లీడర్లు
- ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నా
నాగర్‌కర్నూల్, వెలుగు: 18 నెలలుగా జీతం అందకపోవడం, సర్వీస్ రెన్యువల్ కాలేదన్న మనోవేదనతో శనివారం ఆత్యహత్మకు పాల్పడిన గెస్ట్ లెక్చరర్ గణేశ్‌చారి(30) అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామం బొల్లంపల్లిలో ఉద్విగ్న వాతావరణంలో జరిగాయి. చేతికందొచ్చిన కొడుకు తనకు కొరివి పెడతాడనుకుంటే చివరికి తానే మన్ను పోయాల్సి వచ్చిందంటూ తండ్రి రోదించడం చూసి వచ్చినవారంతా కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం ఉదయం కల్వకుర్తి ప్రభుతాసుపత్రిలో గణేశ్‌చారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, సీనియర్ పొలిటీషియన్ఇందిరా శోభన్, పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందగౌడ్, ఇంటర్బోర్డ్డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూల్ నోడల్ఆఫీసర్ వెంకటరమణ, ప్రిన్సిపల్స్, వివిధ కాలేజీల నుంచి వచ్చిన 100 మంది లెక్చరర్లు గణేశ్‌చారి మృతదేహానికి నివాళి అర్పించారు. మహబూబ్‌నగర్– మిర్యాలగూడ మెయిన్‌రోడ్డుపై బైఠాయించిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి గణేశ్‌చారి తల్లిదండ్రులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. గణేశ్చారిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. 2 సంవత్సరాలు గెస్ట్ లెక్చరర్‌గా పని చేయించుకున్న ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వకపోవడం, కాలేజీలు మొదలైనా వారిని తిరిగి తీసుకోకపోవడం రాక్షసత్వమన్నారు. 405 కాలేజీల్లో 1,654 మంది ప్రభుత్వ గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకొని గాలికి వదిలేశారని విమర్శించారు. నీ కూతురికో నీతి, నిరుద్యోగులకో నీతా అని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవరకు నిద్రపోని కేసీఆర్ నిరుద్యోగుల విషయంలో రాక్షసంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం
ఇంటర్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గణేశ్ మృతి చాలా బాధాకరం అన్నారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్ విషయంలో ప్రభుత్వానికి నివేదిక అందించి, పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తామని చెప్పారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివవర్మ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్, బీజేపీ లీడర్లు కృష్ణయ్య, శ్రీను అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
గణేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతోనే గెస్ట్ లెక్చరర్ గణేశ్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ ఆరోపించారు. గెస్ట్ లెక్చరర్లను ఈ నెల 1వ తేదీ నుంచి రెన్యువల్ చేసినా గణేశ్ బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ సర్కారు హత్యేనని మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు.