నలుగురు పిల్లలకు ఉరివేసి.. అన్నదమ్ములిద్దరు సూసైడ్

నలుగురు పిల్లలకు ఉరివేసి.. అన్నదమ్ములిద్దరు సూసైడ్
  • గుజరాత్​లో కలకలం

అహ్మదాబాద్: గుజరాత్​లో దారుణం జరిగింది. ఔటింగ్​కు అని ఇంట్లోంచి బయటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇందులో నలుగురు 7 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలున్నారు. అహ్మదాబాద్​కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అమ్రిష్ పటేల్(42), గౌరంగ్ పటేల్(40) తొలుత నలుగురు పిల్లలకు ఉరివేసి.. ఆ తర్వాత వారు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇద్దరు అన్నదమ్ములు బుధవారం ఔటింగ్​కు అని భార్యలతో చెప్పి తమ నలుగురు పిల్లలతో కలిసి బయటికి వెళ్లారు. మరుసటి రోజు వరకు తిరిగి రాకపోయేసరికి భార్యలు, కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం గాలించారు. తమ పాత ఇంటికి వెళ్లి చూడగా లోపలి నుంచి లాక్ చేసి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్​కు చేరుకున్న పోలీసులు డోర్స్ ఓపెన్ చేసి చూడగా ఆరుగురు ఉరితాళ్లకు వేళాడుతూ కనిపించారు. డ్రాయింగ్ రూమ్​లో అమ్రిష్ పటేల్, గౌరంగ్ పటేల్.. కిచెన్ రూంలో ఇద్దరు బాలికలు శాన్వి(7), కీర్తి(9), బెడ్​రూంలో ఇద్దరు బాలురు మయూర్(12), ధ్రువ్(12) ల డెడ్ బాడీలు సీలింగ్ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించాయి.
పిల్లలకు ముందుగా మత్తుమందు కలిపిన ఆహారం తినిపించి ఉరివేసి.. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ ఇనిస్పెక్టర్ గోహిల్ మీడియాకు వెల్లడించారు. డెడ్​బాడీలను పోస్టుమార్టానికి పంపించామని, తదుపరి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.