రవిదాస్ ఆశయాలు సమాజానికి ఆదర్శం : సుధాకర్ రెడ్డి  

రవిదాస్ ఆశయాలు సమాజానికి ఆదర్శం : సుధాకర్ రెడ్డి  

సామాజిక సమానత్వానికి ఆయన సందేశం స్ఫూర్తి: సుధాకర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: సంత్ శిరోమణి గురు రవి దాస్ మహరాజ్ ఆశయాలు, ఆయన  బోధించిన సామాజిక సామరస్య సందేశాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళ వారం హైదరాబాద్‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ‘సంత్ రవిదాస్ పవన్ మాటి కలశ’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారణాసిలోని సీర్ గోవర్ధన్‌‌పూర్‌‌లో ఉన్న రవిదాస్ జన్మస్థలం నుంచి తీసుకొచ్చిన పవిత్ర మట్టి కలశానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా సమరసత సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పవిత్ర కలశం సామాజిక సమానత్వం, గౌరవం, జాతీయ ఐక్యతకు గుర్తు అని చెప్పారు.

ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, సమాన అవకాశాలు అందే సమాజాన్ని నిర్మించడమే రవిదాస్‌‌కు నిజమైన నివాళి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్-సబ్ కా ప్రయాస్’ నినాదంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ నేత సంపత్ రాజ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్, జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, రాష్ట్ర నేతలు ప్రకాష్ రెడ్డి, కొప్పు బాషా, పాపారావు, డాక్టర్ సురేఖ, ఓం ప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు