పురుగుల అన్నం పెడ్తున్నరు

పురుగుల అన్నం పెడ్తున్నరు
  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురుకుల స్టూడెంట్ల ధర్నా 

పురుగుల అన్నం పెడుతున్నారని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్​ స్కూల్ స్టూడెంట్లు ఆదివారం రోడ్డెక్కారు. పురుగుల అన్నంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్, హాస్టల్​వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్  నుంచి కూరగాయలు, ఇతర సామగ్రిని ప్రతిరోజు ప్రిన్సిపాల్​ తన ఇంటికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అటెండర్ రాత్రి డ్రింక్​ చేసి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పురుగుల అన్నం పెడుతున్నారని గురుకుల స్టూడెంట్లు రోడ్డెక్కారు. ఆదివారం ఉదయం 6 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్​స్కూల్ (గర్ల్స్) స్టూడెంట్లు ధర్నా చేపట్టారు. పురుగుల అన్నంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్, హాస్టల్​వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘అన్నంలో పురుగులు, వానపాములు వస్తున్నయ్. ఆ తిండి తినలేకపోతున్నం. దీనిపై అడిగితే హాస్టల్ వార్డెన్ ఉల్టా మమ్మల్నే బెదిరిస్తున్నరు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి వేధిస్తున్నరు. న్యూయర్ కల్చరల్ ఫెస్టివల్ కు కాస్ట్యూమ్స్ ​కోసం ప్రభుత్వం రూ.60 వేలు ఇస్తే, ప్రిన్సిపాల్ ​మేడమ్ ​రూ.20 వేలు మాత్రమే ఖర్చుపెట్టారు. హాస్టల్ లో మిగిలిన కూరగాయలు, ఇతర సామగ్రిని ప్రతిరోజు ప్రిన్సిపాల్ ​తన ఇంటికి తీసుకెళ్తున్నారు. కల్చరల్ ఫెస్ట్​ సందర్భంగా 50 చపాతీలు, 3 కిలోల మటన్​ ఇంటికి తీసుకెళ్లారు. అటెండర్ రామస్వామి రాత్రి డ్రింక్ ​చేసి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని కొడుతున్నారు. ఆయనపై ప్రిన్సిపాల్​కు కంప్లయింట్ చేస్తే, అటెండర్ మంచోడంటూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రిన్సిపాల్, వార్డెన్,అటెండర్ బారి నుంచి మమ్మల్ని కాపాడాలి. మాకు న్యాయం చేయాలి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏబీవీపీ ఆందోళనతో ఉద్రిక్తత..

స్టూడెంట్లు ఉదయం ఆందోళన చేయగా, సాయంత్రం స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్నా చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను కొంతమంది ఆఫీసర్లు బెదిరించారు. అప్పటికే గేటు దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు ఉండగా, స్టూడెంట్స్ ఏడ్చుకుంటూ వచ్చి విషయం చెప్పారు. దీంతో తమను లోపలికి అనుమతించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చి, ఏబీవీపీ నాయకులతో గొడవకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని సస్పెండ్ ​చేస్తున్నట్లు గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న తెలిపారు. అటెండర్ రామాస్వామిని డ్యూటీ నుంచి తొలగించారు.