బొట్టు పెట్టుకునేందుకు భార్య నిరాకరణ.. హైకోర్టు విడాకులు మంజూరు

బొట్టు పెట్టుకునేందుకు భార్య నిరాకరణ.. హైకోర్టు విడాకులు మంజూరు

హిందూ వివాహ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్ల‌యిన ఓ మ‌హిళ‌.. పెళ్లి తర్వాత నుదుట సింధూరం , చేతులకు గాజులు ధరించేందుకు అంగీకరించకపోతే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గౌహతి హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బొట్టు , గాజులు ధ‌రించ‌డ‌మ‌నేది హిందూ వధువు పాటించే ఆచారాలని, వరుడితో వివాహాన్ని అంగీకరిస్తున్నట్టు ఇవి సూచిస్తాయని కోర్టు చెప్పింది. ఓ విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఈ కారణాలతో ఆ భర్తకు కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది.

అసోంలోని ఓ జంటకు 2012 ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన నెలకే కుటుంబంతో కాకుండా విడిగా ఉందామని భార్య తన భర్తపై ఒత్తిడి తెచ్చింది. తనకు అత్తామామలు, ఆడపడుచులతో కలిసి జీవించడం ఇష్టం లేదని చెప్పగా, ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో ఆమె భర్తపై అలిగి 2013లో తన పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్లిన ఆమె భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు కూడా పెట్టింది. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త, విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఫ్యామిలీ కోర్టు… విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించగా, బాధితుడు హైకోర్టునాశ్రయించాడు.

అతని పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ అజయ్‌ లాంబా, జస్టిస్‌ సౌమిత్రా సైకియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 19న సంచ‌ల‌న‌ తీర్పును వెలువరించింది. హిందూ మహిళ, వివాహం తర్వాత ముఖానికి సింధూరం, కాళ్లకు మెట్టెలు ధరించడం సాంప్రదాయమని కోర్టు అభిప్రాయపడింది. ఇది భారతీయుల మనోభావాలకు సంబంధించిన విషయమని, భర్త మనోభావాలను గౌరవించాలని, ఆ పని చేయలేకుంటే వివాహ బంధానికి అర్థం లేదని చెప్పింది.

బొట్టు, గాజులు ధరించేందుకు ఇష్టపడటం లేదంటే, తాను అవివాహితనని ప్రపంచానికి తెలియజేయాలని ఆమె భావిస్తోంది. వివాహ బంధాన్ని కొనసాగించడం ఆమెకు ఇష్టం లేనట్టుగా ఉందంటూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.