ఈ లాక్డౌన్ మనల్ని చాలానే తిప్పలు పెడుతోంది. వాటిలో హెయిర్ కటింగ్ ఒకటి. వారానికి ఒకసారి షేవింగ్ కోసం, నెలకో రెండు నెలలకో ఒకసారి హెయిర్ కట్ కోసం సెలూన్ వైపు చూసే వాళ్లు మనలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సెలూన్లన్నీ బంద్ అయిపోవడంతో, వాళ్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. బోలెడన్ని కష్టాలు పడుతున్నారు. అవన్నీ చూసేవాళ్లకీ, వినేవాళ్లకీ నవ్వు తెప్పిస్తున్నాయి.
కొందరైతే తమ కటింగ్ తామే చేసుకోవడానికి కూడా వెనకాడడంలేదు. ఇంకొందరికి ఫ్రెండ్స్, పేరెంట్స్, భార్య చేస్తున్నారు. అయితే అవన్నీ రకరకాల షేపుల్లో ఉంటున్నాయి. ‘అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటి’ అనే తెలుగు సినిమా పాట తరహాలో సిచ్యుయేషన్స్ ఉన్నాయి. హెయిర్ కట్ తర్వాత అద్దంలో మొహాన్ని చూసుకుని షాక్ అయినా, ఆ తర్వాత దాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. దీన్నో మెమరీగా గుర్తుపెట్టుకుంటున్నారు.
గుండు అయిపోతుంది…
నిజానికి హెయిర్‌కట్ అంత సింపుల్ ఏమీ కాదు. చాలా కష్టమైన పని. అలా యూట్యూబ్‌లో చూసి, ఇలా నేర్చేసుకునేది అసలే కాదు. దానికి బోలెడంత ప్రాక్టీస్ అవసరం. ఈ లాక్డౌన్ కాలంలోనూ అదిరిపోయే లుక్ కావాలనుకుంటే మాత్రం, మొదటికే మోసం వస్తుంది. రకరకాల స్టయిల్స్ ప్రయత్నం చేసిన వాళ్లలో ఎక్కువ మందికి చివరికి గుండే మిగులుతుంది. అనుకున్న షేప్‌లో హెయిర్ కట్ రాకపోవడంతో, వచ్చిన షేప్ మరీ దారుణంగా ఉండటంతో, హెయిర్ కట్ కాస్తా గుండు అవుతోంది.
గడ్డం, మీసాలు అవుట్…
చాలామంది షేవింగ్ కోసం కూడా సెలూన్ల మీదే ఆధారపడతారు. కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లు అయితే, హాయిగా ఇంట్లోనే పూర్తిచేసుకుంటారు. అప్పుడప్పుడే మీసాలు, గడ్డాలు పుట్టుకొస్తున్న వాళ్లకు మాత్రం ఇది కష్ట కాలమే అని చెప్పుకోవాలి. షేవింగ్ చేసుకోబోయి, మొహం నిండా గాట్లు పెట్టేసుకుంటున్నారు. మీసాలను సరిచేసుకోబోతే, ఆ షేప్ దెబ్బతింటోంది. దాంతో మీసాలను కూడా పూర్తిగా తీసేస్తున్నారు. ఈ కొత్త లుక్‌తో తమని తామే చూసి, నవ్వుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరి కష్టాలు ఒక్కోలా ఉన్నాయి. అవి ఇలా ఉన్నాయి.
వాడి మీసాలు పోయాయి
నేను హైదరాబాద్‌లో ఉంటాను. సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేస్తుంటాను. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ, రూమ్‌లోనే ఉంటున్నాను. లాక్‌డౌన్‌కు ముందే కటింగ్, షేవింగ్ చేయించుకోవడంతో నేను బతికిపోయాను. నా ఫ్రెండ్ జుట్టు మాత్రం విపరీతంగా పెరగిపోయింది. చికాకుగా అనిపించి ఏదీ రాసుకోలేకపోతున్నాడు. ఇక తప్పదని నేనే వాడికి హెయిర్‌కట్, షేవింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇక అప్పుడు మొదలయ్యాయి తిప్పలు. ఎంత జాగ్రత్తగా చేస్తున్నా, ఎటునుంచి ఎటు చేస్తున్నానో అర్ధం కాలేదు. చివరికి కోడి తలలా తయారైంది. అంత వరకూ అయితే ఓకే. పనిలోపనిగా కానిచ్చేద్దాం అనుకుని, షేవింగ్ కూడా మొదలెట్టాను. ఇప్పటివరకు నాకు నేనే షేవ్ చేసుకోలేదు. అలా మొదలుపెట్టీపెట్టగానే, పొరపాటున ఒక పక్క మీసం కట్ అయిపోయింది. ఇక చేసేదేమీ లేక, మీసాలను పూర్తిగా తీసేశాను. షేవింగ్తో పాటుగా, మొహం మీద నాలుగైదు గాట్లు కూడా పెట్టేశాను. -
– శేషు కొర్లపాటి
అలా కవర్ చేశాను…
మాది జగిత్యాల. ఈ మధ్యే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తిచేశా. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో చెఫ్‌గా చేస్తున్నా. ఏ పనిచేసినా… క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా చేయాలని ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల హోటల్ లేకపోవడంతో మరీ బోర్ కొట్టేస్తూ ఉంది. దాంతో నా రూమ్మేట్కి హెయిర్ కట్ చేద్దాం అనుకున్నా. ఎందులో అయినా నాదైన మార్క్ ఉండకపోతే, అది నాకు నచ్చదు. అమీర్ ఖాన్ లుక్ వచ్చేలా, స్టయిల్‌గా చేద్దాం అనుకున్నా. ఏమనుకుని మొదలుపెట్టానో అది మాత్రం రాలేదు. ఆయనది రింగుల జట్టు. అది కాస్తా కొబ్బరిపీచులా అయింది. ఇక చేసేదిలేక గుండుచేసి పడేశాను. ‘అటూఇటూ కదలడం వల్లే, ఇలా అయిందని, లేదంటే మంచి లుక్ వచ్చేది” అని కవర్ చేసుకున్నాను.
– సాయి
అలా అంటున్నారు
ఈ లాక్డౌన్ గాని లేకపోయి ఉంటే, అసలు మా బార్బర్ షాపు బాబాయి విలువే తెలిసేది కాదు. ఇంతకుముందు అయితే షాపుకి వెళ్లి, నచ్చిన స్టైల్లో హెయిర్ కట్ చేయించుకునే వాడిని. ఆ తరువాత పాయింట్ వన్ మెజరెమెంట్తో నీటుగా ట్రిమ్ చేయించుకునే వాడిని. ఆ తరువాత ఆయిల్‌తో హెడ్ మసాజ్. కొంత డబ్బులు ఇచ్చి హాయిగా ఒక రిలాక్సేషన్‌తో , ఇంటికి వచ్చి స్నానం చేసేవాడిని. నిన్న ఫస్ట్ టైం నా కటింగ్ నేనే చేసుకున్నాను. భయమేసి, సైడ్స్ వరకూ చేసుకుని, వదిలేశాను. ఆ తర్వాత షేవ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. పొరపాటున గడ్డంతో పాటుగా మీసం కూడా పోయింది. ఈ కొత్త లుక్ చూసిన అందరూ నవ్వారు. కొందరైతే ‘నర్తనశాలలో ఎన్టీఆర్‌లా ఉన్నావ’న్నారు. చివరికి నాచేతులతో నేనే చేసుకున్న ఆ పనివల్ల, తెల్ల గుమ్మడికాయలా అయిపోయాను.
– గోగాడ రాజేష్
బానే వచ్చింది కానీ…
నా పేరు మాధవి. తెనాలిలో ఉంటాం. నేనో గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ లాక్డౌన్లో మా ఆయన జుట్టు అడ్డదిడ్డంగా పెరిగిపోయింది. కాస్త అటూఇటూ అయినా, పర్వాలేదులే అనుకున్నా. నేనే కటింగ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయా. ఆయన చేతిలో ఒక అద్దం పెట్టి, పని మొదలుపెట్టేశాను. అడ్డదిడ్డంగా పెరిగిన జట్టును, నేనూ అడ్డదిడ్డంగానే కట్ చేసి పడేశా. ఎలా వస్తుందో అనుకున్నా, మరీ ప్రొఫెషనల్‌లా చేయలేకపోయినా, బాగానే చేశాను. ఆడవాళ్లు తలుచుకుంటే, ఏపనైనా సింపుల్‌గా చేసేయగలరు కదా!
– కొండా మాధవి
