అర్ధరాత్రి అరెస్ట్ : హాజీపూర్ బాధితుల నిరాహార దీక్ష భగ్నం

అర్ధరాత్రి అరెస్ట్ : హాజీపూర్ బాధితుల నిరాహార దీక్ష భగ్నం

యాదాద్రి భువనగిరి : సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలంటూ హాజీపూర్ గ్రామస్థులు చేస్తున్న ఆమరణ నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో దీక్ష చేస్తున్న 15 మందిని అరెస్టు చేసి హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెండు రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగించిన గ్రామస్థులు….. శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దీక్ష చేసిన బాధిత కుటుంబాలను మరికాసేపట్లో గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత గ్రామానికి బాధిత కుటుంబ సభ్యులను తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. కేసు విచారణ త్వరగా పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడే ఏర్పాట్లను చేస్తామని బాధితులకి హామీ ఇచ్చామని తెలిపారు పోలీసులు.