ఆర్టీసీ సమ్మె : తాత్కాలిక సిబ్బందికి సగమే జీతం!

ఆర్టీసీ సమ్మె : తాత్కాలిక సిబ్బందికి సగమే జీతం!

మూడో రోజూ కొనసాగిన ఆర్టీసీ సమ్మె
గన్పార్క్వద్ద ఉద్రిక్తం.. జేఏసీ నేతల అరెస్టు
నివాళులర్పించకుండా అడ్డగింత
కార్మికులకు అన్ని పార్టీలు, సంఘాల సంఘీభావం
సరిపోని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

హైదరాబాద్‌, వెలుగు:ఆర్టీసీ సమ్మె సోమవారం మూడో రోజూ కొనసాగింది. గడువులోగా డ్యూటీలో చేరని వాళ్లందరి ఉద్యోగాలు పోయినట్లేనని, ఆర్టీసీలో 50శాతం ప్రైవేటు బస్సులను తీసుకువస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై కార్మికులు భగ్గుమన్నారు.  వివిధ రీతుల్లో నిరసనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాaర్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద 144 సెక్షన్‌ కొనసాగుతూనే ఉంది. సమ్మెలో భాగంగా డిపోల వద్ద కార్మికుల నిరసనలు కొనసాగాయి. వారికి అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సంఘీభావం తెలిపాయి. మరోవైపు సమ్మె కారణంగా డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవీ సరిపోలేదు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌తోపాటు ఆర్టీసీలోనూ  కొందరు తాత్కాలిక కండక్టర్లు దోపిడీ చేస్తున్నారు.

గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తం

హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద అమరు వీరుల స్థూపం వద్ద నివాళులర్పించడానికి వెళ్లిన ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై నేతలు మండిపడ్డారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్‌ రాజిరెడ్డి సహా కార్మికులను అరెస్టు చేసి.. వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. అక్రమ అరెస్టులను, నిర్బంధాలను వివిధ సంఘాల నేతలు ఖండించారు. సోమవారం ఉదయం ఇందిరాపార్క్‌ వద్ద ఆర్టీసీ జేఏసీ నిర్వహించాల్సిన నిరాహార దీక్ష,  బహిరంగ సభకు అనుమతి లేకపోవడంతో రద్దయింది. 

టెంపరరీ కండక్టర్ల దోపిడీ!

సమ్మె నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేట్‌ ట్రావెల్స్‌, ప్రైవేటు వాహనాల యజమానులు డబుల్‌, ట్రిబుల్‌ రేట్లు పెంచి ప్రజల నుంచి పైసలు గుంజుతున్నారు.  ప్రభుత్వం నియమించిన తాత్కాలిక కండక్టర్లలో కొందరు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పండుగ సమయంలో టికెట్‌ చెకింగ్‌ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించి, టికెట్‌ తీసుకోని వారిపై కొరడా ఝుళిపించేవారు. కానీ ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో వీరెవరూ అందుబాటులో లేరు. దీంతో తాత్కాలిక కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, టికెట్​ కూడా ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే దిగిపొమ్మంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా అవి సరిపోవడం లేదని, దసరాకు సొంతూళ్లకు వెళ్లాలంటే చాలా కష్టమవుతోందని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 3,063 మంది కండక్టర్లు, 3,063 మంది డ్రైవర్లు రిపోర్ట్‌ చేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.  3105 ఆర్టీసీ, 2,013 అద్దె బస్సులతో 5,118 బస్సులు నడిపామన్నారు.

తాత్కాలిక సిబ్బందికి
సగమే జీతం!

కండక్టర్లు, డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడంతో సర్కార్‌ తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంది. వీరికి రోజుకు కండక్టర్‌కైతే రూ. 1000, డ్రైవర్‌కైతే రూ.  1500 ఇస్తామని పేర్కొంది. దీంతో వేల సంఖ్యలో కండక్టర్‌, డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొని.. సమ్మె మొదటి రోజు నుంచే డ్యూటీలో చేరారు. అయితే ఫలానా టార్గెట్‌ను చేరితేనే నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం జీతం ఇస్తామని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో పూర్తి డబ్బులు ఇవ్వకుండా సగం మాత్రమే ఇస్తున్నారని పలువురు తాత్కాలిక సిబ్బంది వాపోతున్నారు. కండక్టర్‌కు వెయ్యికి బదులు రూ. 400 నుంచి 500, డ్రైవర్‌కు రూ. 1500కి బదులు 800లే ఇస్తున్నారని వారు అంటున్నారు.