సగం మంది గిరిజనులకు ఇండ్లు లేవు

సగం మంది గిరిజనులకు ఇండ్లు లేవు
  •     రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి దుర్భరం
  •     80 % ఎస్టీ కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు
  •     ఎస్టీలపై దాడుల్లో దేశంలో తెలంగాణకు ఫోర్త్ ప్లేస్
  •     కేంద్ర గిరిజన శాఖ 2020–21 రిపోర్టులో వెల్లడి


హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో అడవి బిడ్డల పరిస్థితి దుర్భరంగా తయారైంది. కనీస సౌకర్యాల్లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సగం గిరిజన కుటుంబాలకు ఉండేందుకు సరైన ఇండ్లు లేవు. మూడొంతుల కుటుంబాలకు లెట్రిన్‌ సౌకర్యమే లేదు. 12 శాతం ఇండ్లకు కరెంటు లేక ఇంకా కిరోసిన్‌పైనే ఆధారపడి బతుకుతున్నారు. రాష్ట్రంలో ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయి. గిరిజనుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ప్రభుత్వం సరిగా ఖర్చు చేయట్లేదు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ తమ 2020-–21 వార్షిక నివేదికలో వెల్లడించింది.     

రాష్ట్రంలోని వరంగల్‌‌, ఆదిలాబాద్‌‌, ఖమ్మం, మహబూబాబాద్‌‌, నల్గొండ జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీళ్లకు హాస్పిటళ్లు, సబ్‌‌ సెంటర్లు, పీహెచ్‌‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌‌ సెంటర్లు అవసరానికి కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. 932 సబ్‌‌ సెంటర్లు అవసరమైతే 698 మాత్రమే నడుస్తున్నాయి. 139 పీహెచ్‌‌సీలు అవసరం కాగా 93 పని చేస్తున్నాయి. 34 కమ్యూనిటీ హెల్త్‌‌ సెంటర్లు కావాల్సి ఉండగా 23 మాత్రమే ఉన్నాయి. పీహెచ్‌‌సీల్లో 93 మంది హెల్త్‌‌ వర్కర్లు అవసరం ఉండగా ఒక్కరూ లేరు. కమ్యూనిటీ హెల్త్‌‌ సెంటర్లలో 161 మంది నర్సింగ్‌‌ స్టాఫ్‌‌ అవసరం ఉండగా 23మందే ఉన్నారు. 

86 శాతం కుటుంబాలకు కరెంట్‌‌

రాష్ట్రంలో 8,40,723 గిరిజన కుటుంబాలున్నాయి. ఇందులో 86 శాతం కుటుంబాలకు కరెంట్ సౌకర్యం ఉంది. 12.1శాతం కుటుంబాలు ఇంకా కిరోసిన్‌‌నే వాడుతున్నాయి. 0.4 శాతం కుటుంబాలు సోలార్‌‌ ఎనర్జీని వినియోగిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల వారీగా చూస్తే 92.3 శాతం కుటుంబాలకు విద్యుత్‌‌ సదుపాయం ఉంది. 6.6 శాతం కుటుంబాలు కిరోసిన్‌‌పై ఆధారపడుతున్నాయి.  

78 శాతం మంది ఆరుబయటే మల విసర్జన

రాష్ట్రంలోని మొత్తం గిరిజన కుటుంబాల్లో 80.1 శాతం కుటుంబాలకు లెట్రిన్స్‌‌ లేవు. ఈ విషయంలో దేశంలో తెలంగాణ కింది నుంచి 9వ స్థానంలో ఉంది. 78 శాతం మంది గిరిజనులు ఇంకా ఆరుబయటే మల విసర్జన చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను చూస్తే 47 శాతం కుటుంబాలకు లెట్రిన్స్‌‌ లేకపోగా 46.6 శాతం మంది బయట మలవిసర్జన చేస్తున్నారు.

సరైన ఇండ్లు 58 శాతమే

రాష్ట్రంలోని మొత్తం 8.4 లక్షల గిరిజనుల ఇండ్లల్లో 58 శాతమే నివాసయోగ్యంగా ఉన్నాయి. 42 శాతం కుటుంబాలకు ఇండ్లు లేకపోవడం, ఉన్నా అరకొర వసతులతో ఉండటం జరుగుతోంది. 58 శాతం ఇండ్లలోనూ 35.7 శాతం ఇండ్లకే లెట్రిన్‌‌ సౌకర్యం ఉంది. 19.9 శాతం మంది ఇండ్లలోనే సపరేట్‌‌ కిచెన్‌‌ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలను చూస్తే 84.21 లక్షల కుటుంబాల్లోగా 67.8 శాతం కుటుంబాల్లోనే నివాసయోగ్యమైన ఇండ్లున్నాయి. వీటిలో 52.4 శాతం ఇండ్లలో మరుగుదొడ్లు, 52.2 శాతం ఇండ్లలో సపరేట్‌‌ కిచెన్‌‌ ఉంది. 

గిరిజనులపై దాడులు పెరిగినయ్‌‌

గిరిజనులపై దాడుల్లో దేశంలో తెలంగాణ ముందుంది. 2017 నుంచి 2019 వరకు వివరాల ప్రకారం దేశంలో 16 శాతం దాడులతో తెలంగాణ  4వ స్థానంలో ఉంది. 2017లో 435, 2018లో 419, 2019లో 530 దాడులు గిరిజనులపై జరిగాయి. ఇటీవల రాష్ట్రంలో నెల వ్యవధిలోనే ముగ్గురు ఎస్టీ అమ్మాయిలపై రేప్‌‌ చేసి మర్డర్‌‌ చేసిన ఘటనలు జరిగాయి. గిరిజనుల హ్యూమన్‌‌ ట్రాఫికింగ్‌కు సంబంధించి 2019లో రాష్ట్రంలో 137 కేసులు రిపోర్ట్‌‌ అయ్యాయి. ఎస్టీ సబ్‌‌ప్లాన్‌‌ నిధులను రాష్ట్రంలో పూర్తిగా ఖర్చు చేయట్లేదు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 67 శాతం 2019–20లో 88.49 శాతం ఖర్చు చేశారు. 2020–21లో 36.67శాతమే ఖర్చు పెట్టారు.