- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
గోషామహల్, వెలుగు: ఆర్టీసీ డిపోల్లో పనిచేస్తున్న లైసెన్స్‌డ్ హమాలీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. గతంలో బస్తాకు రూ.10గా ఉన్న హమాలీ కూలీని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7.40కు తగ్గించడం అన్యాయమని, తక్షణమే రూ.20కు పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ పార్కులో తెలంగాణ ఆర్టీసీ హమాలీ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రథమ మహాసభ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నరసింహ అధ్యక్షతన జరిగింది. మహాసభకు ముందు ఎంజీబీఎస్ కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయం నుంచి ఇమ్లీబన్ పార్కు వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. హమాలీ కూలి రేట్లు పెంచాలని, రెండు జతల యూనిఫాంలు, బస్‌పాస్, ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సరుకు రవాణా సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి వైద్య సదుపాయం, బస్‌పాస్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, యూనియన్ నాయకులు జి.దాసు, ఎం.డి.కాశీం, కె.కొండయ్య పాల్గొన్నారు.
