చేతి వృత్తులకు కష్టకాలం

చేతి వృత్తులకు కష్టకాలం

ఫుడ్‌‌‌‌ డెలివరీ బాయ్స్‌‌ మొదలు హెయిర్‌‌‌‌ కట్‌‌ చేసే మంగలి వరకు..మేస్త్రీకి ఇటుకలు అందించే కూలీ నుంచి ఇంటీరియర్ డిజైనర్‌‌‌‌ వరకు..ఇలా ఏ రంగంలో చూసినా మన దగ్గర ఇతర రాష్ట్రాల వాళ్లే కనిపిస్తుంటారు. దీనికి.. మనవాళ్ల స్కిల్స్​కు ప్రోత్సాహం లేకపోవడం ఒక కారణమైతే.. అవతలి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు తక్కువ జీతానికే పనిచేయడం మరో కారణం. ఏ పనికైనా ‘మేమున్నాం’ అంటూ వచ్చే ఇతర రాష్ట్రాల కార్మికులతో పోటీ పడాలంటే  మనవాళ్లకు స్కిల్స్‌‌ పెంచుకునే ట్రైనింగ్ అవసరం. కొన్నేండ్లుగా ఇలాంటి ప్రోత్సాహం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లేకపోవడం వల్లే ఇప్పుడు ఏ జిల్లాలో చూసినా ఇతర రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.

కులవృత్తులు, స్కిల్‌‌ బేస్డ్‌‌ పనుల(ఎలక్ట్రీషియన్‌‌, మెకానిక్స్‌‌, ప్లంబర్స్‌‌, మెకానిక్స్‌‌, ఇంటీరియర్ డిజైనింగ్‌‌ లాంటివి)కు తెలంగాణ యువత దూరమవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇన్నేండ్లలో కుల వృత్తులకు ప్రోత్సాహం కరువైంది. ముఖ్యంగా నిర్మాణ రంగాలకు సంబంధించి స్కిల్ డెవలప్​మెంట్​ సెంటర్లు  ఏర్పాటుకాలేదు. అందుకే బిహార్, ఉత్తర్‌‌‌‌ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ నుంచి లక్షల మంది కార్మికులు వలస వచ్చి, నిర్మాణ రంగంలో పనులు చేస్తున్నారు. దాంతో స్థానిక యువతకు ఉపాధి కరువైంది. 

ముఖ్యంగా బిల్డింగ్ నిర్మాణ పనులు, సెంట్రింగ్, గ్రానైట్, మార్బుల్, వడ్రంగి, ఇంటీరియర్‌‌‌‌ డిజైనింగ్, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ పనుల్లో రాష్ట్ర యువతకు స్కిల్స్‌‌ లేకపోవడంతో ఉపాధి కోల్పోతున్నారు. కొద్దిపాటి స్కిల్స్‌‌ ఉన్న యువకులకు సరిపడా పని దొరక్కపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితులు కేవలం నిర్మాణ రంగంలోనే కాదు.. ఇతర వృత్తుల్లో కూడా కనిపిస్తున్నాయి. అర్చకత్వం చేసేందుకు నిష్ణాతులైన వేద పండితులు దొరక్క రాజస్తాన్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వాళ్లను రప్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో ప్రతి ఏటా పెరుగుతుండగా, ఇంకోవైపు రకరకాల కారణాలతో మధ్యలోనే చదువు ఆపేసిన యువతకు ఉపాధి దొరక్క చిన్నాచితకా పనులతో సరిపెట్టుకుంటున్నారు. లేదంటే ఆటో, ట్రాక్టర్​, మోటార్ వెహికల్స్ నడుపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. 

బర్రెలతో ఆగమాగం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం ‘స్కిల్ డెవలప్‌‌మెంట్’ పేరిట ప్రత్యేకంగా ట్రైనింగ్స్ ఇప్పించింది. మన రాష్ట్రం వచ్చాక స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లకు బదులు వైన్‌ షాపులే పెరిగాయి. పదేళ్లలో తెలంగాణలో నిర్మాణ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కానీ స్కిల్డ్ వర్కర్లు స్థానికంగా దొరక్కపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. బిహార్, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రాలకు చెందిన మేస్త్రీలు, వర్కర్లు, పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తున్నారు.

నిన్నమొన్నటి వరకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి పెద్ద నగరాలకే పరిమితమైన వలసలు ఇప్పుడు పట్టణాలకూ విస్తరించాయి. వాళ్లు నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్‌‌ దుకాణాలు పెడుతున్నారు. పీఓపీ, రెయిలింగ్, వెల్డింగ్, కరెంట్, వడ్రంగి, ఇంటీరియర్‌‌‌‌ వర్క్స్ చేస్తున్నారు. గ్రానైట్, మార్బుల్స్, ప్లంబింగ్ పనులకు అవసరమైన మెటీరియల్‌‌ను సప్లై చేస్తున్నారు. లోకల్ వర్కర్లు లేకపోవడంతో ఇంజినీర్లు, బిల్డర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా నాన్​లోకల్ వర్కర్లకే పని కల్పిస్తున్నారు. 

ఆదాయం అంతంతే

లోకల్‌‌యూత్‌‌కు సరైన స్కిల్స్‌‌ లేకపోవడంతో ఆదాయం కూడా అంతంతమాత్రంగానే వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు ముప్పై ఏళ్లకే మేస్త్రీలు, షాపుల ఓనర్లుగా సెటిల్‌‌ అవుతున్నారు. మనవాళ్లకు మాత్రం ఆయా రంగాల్లో ట్రైనింగ్‌‌ లేక పనివాళ్లుగానే మిగిలిపోతున్నారు. ‘‘మనవాళ్లతో పోలిస్తే.. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఎక్కువ టైం పనిచేయడం కూడా ఇందుకు ఒక కారణం.

అందుకే రోజువారీ ఆదాయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాన్‌‌ లోకల్ యూత్ పనిచేస్తారు. లోకల్‌‌ వాళ్లు మాత్రం ఉదయం10 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పనిచేస్తున్నారు. మనవాళ్లు కూడా అలా చేస్తే.. ఆశించిన ఆదాయం దక్కుతుంది” అని నిర్మాణ రంగ వ్యాపారులు చెప్తున్నారు. 

మళ్లీ తెరుచుకుంటున్నయ్‌‌

ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ స్కిల్​ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్లు తెరుచుకుంటున్నాయి. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్య 65 కోట్ల రూపాయలతో స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. ‘‘అన్ని జిల్లాల్లో సెంటర్​లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఐటి టవర్లు కట్టింది తప్ప స్థానికంగా ఉపాధి కల్పించేందుకు స్కిల్‌‌ డెవలప్​మెంట్ సెంటర్లు ఏర్పాటుచేయలేదు. పైగా గొర్రెలు, బర్రెలు, చేపల్లాంటి జనాకర్షక పథకాలను తెచ్చింది. అయితే.. ఇప్పుడు మాత్రం యువతకు స్కిల్స్‌‌ నేర్పించేందుకు లాంగ్‌‌టర్మ్‌‌, షార్ట్‌‌ టర్మ్‌‌ కోర్సులు, ఉచిత ట్రైనింగ్స్‌‌ ఇస్తాం. ట్రైనింగ్‌‌ కోసం వచ్చే యువతకు గతంలో ఎలాగైతే ఉచిత భోజన వసతి ఉండేదో ఇప్పుడు కూడా అలా అందించే ప్రయత్నం చేస్తాం” అన్నారు మంత్రి.

జువెలరీ దుకాణాలు 

నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపు 50కి పైగా నగలు తయారు చేసే దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు విశ్వబ్రాహ్మణ (అవుసలి )కులానికి చెందిన వాళ్లవి. వీళ్లు వృత్తికి సంబంధించి ఎలాంటి స్కిల్​ ట్రైనింగ్‌‌ తీసుకోవడం లేదు. అందుకని పాత తరంవాళ్లు ట్రెడిషనల్ నగలు మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. స్కిల్స్‌‌ లేకపోవడం వల్ల మారుతున్న జువెలరీ  ట్రెండ్‌‌ అందుకోలేకపోతున్నారు. దాంతో ఇక్కడికి వెస్ట్ బెంగాల్ నుంచి కళాకారులను రప్పించి కొత్త రకం నగలను తయారు చేయిస్తున్నారు కొందరు వ్యాపారులు. అందుకోసం ప్రత్యేకంగా తయారీ యూనిట్లను కూడా పెట్టారు.

 దాంతో ఈ దందా సక్సెస్ అయ్యింది. ఇక్కడికి వచ్చిన బెంగాల్ వాళ్లు అక్కడితో ఆగకుండా సొంతంగా ఖార్కానాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం నిర్మల్‌‌లో బెంగాల్ వాళ్ల ఖార్కానాలు ఇరవైకి పైగా నడుస్తున్నాయి. ఇక్కడి విశ్వ బ్రాహ్మణులు మాత్రం ఇప్పటికీ బెంగాల్ కళాకారులపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. కేవలం కమిషన్‌‌ మీదనే ఆధారపడుతున్నారు. దుకాణాల్లో మనవాళ్లే కనిపిస్తున్నా తెర వెనుక మొత్తం బెంగాలీలే ఉన్నారు. ఇప్పుడు నిర్మల్‌‌తోపాటు నిజామాబాద్‌‌ జిల్లా ఆర్మూర్‌‌‌‌లో కూడా కార్కానాలు మొదలుపెట్టారు. కొత్త స్కిల్స్, ఆధునిక పనిముట్లతో సిల్వర్, గోల్డ్ మార్కెట్‌‌ను శాసిస్తున్నారు.

పని లేక ప్రైవేట్ జాబ్ 

కందుకూరి ప్రవీణ్‌‌ది జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం, నమిలిగొండ గ్రామం.  తల్లిదండ్రులు వనమ్మ, కృష్ణమాచారి. ప్రవీణ్ డిగ్రీ చదువుకున్నాడు. వారసత్వంగా సంక్రమించిన స్వర్ణకార వృత్తి  పనిని తండ్రి నుంచి నేర్చుకున్నాడు. పన్నెండేళ్లు ఈ వృత్తిలోనే ఉన్నాడు. మల్టీ నేషనల్ కంపెనీలు నగరాల్లో జువెలరీ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తుండడంతో స్వర్ణకార వృత్తికి ఆదరణ తగ్గి, పని దొరకలేదు. దాంతో కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ‘‘ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్వర్ణకార వృత్తిని కాపాడాలి. వృత్తి పనులు చేసే వాళ్లను ప్రోత్సహించాలి’’ అంటున్నాడు. 

పాత సాంచాలతో పని..

మంతేనా రమేష్‌‌ సిరిసిల్ల జిల్లాలో పవర్‌‌‌‌ లూమ్‌‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ముప్పై ఏండ్లుగా చేనేత రంగంలో పని చేస్తున్నా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికీ పాత సాంచాలతో పని చేస్తున్నాడు. కానీ.. వాటితో బట్ట తయారుచేసేందుకు చాలా టైం పడుతోంది. కాబట్టి ‘‘సర్కార్  స్కిల్స్‌‌ డెవలప్‌‌మెంట్‌‌లో భాగంగా ట్రైనింగ్‌‌ ఇస్తే బాగుంటుంది’’ అంటున్నాడు.

సిరిసిల్లలో రమేష్​ లాంటి పవర్‌‌‌‌లూమ్‌‌ కార్మికులు దాదాపు ఐదు వేల మంది ఉన్నారు. వాళ్లంతా పాత సాంచాల మీదనే పని చేస్తున్నారు. వాటితో మారుతున్న ట్రెండ్స్‌‌కు తగ్గట్టుగా ప్యాషన్ డిజైన్స్‌‌తో బట్టలు ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ప్రొడక్షన్‌‌లో వేగం పెరగడం లేదు. మరమగ్గాల్లో మోడర్న్​ లూమ్స్ వాడితే తమిళనాడు, బీమండి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే మోడర్న్​ దుస్తులను సిరిసిల్లలో కూడా ఉత్పత్తి చేయొచ్చు.

సిరిసిల్లలో కొందరు ఆసాములు మాత్రమే మోడర్న్​ మగ్గాలను వాడుతున్నారు. ఎయిర్ జెట్, వాటర్ జెట్, ర్యాపియర్ లాంటి మగ్గాలు గంటకు 400 మీటర్ల స్పీడ్‌‌తో బట్టను ఉత్పత్తి చేస్తాయి. కానీ.. పాత సాంచాలతో గంటకు కేవలం180 మీటర్ల స్పీడ్ మాత్రమే సాధ్యమవుతుంది. మోడర్న్​ మగ్గాలపై పని చేస్తేనే సిరిసిల్ల చేనేత కార్మికులు ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలుగుతారు. సిరిసిల్ల పవర్‌‌‌‌లూమ్‌‌ కార్మికులకు జీవనోపాధి పొందే మార్గం దొరుకుతుంది. 

అడ్డా కూలీగా...

కులవృత్తి కడుపు నింపకపోవడంతో కుటుంబ పోషణ కోసం అడ్డా కూలీగా మారాడు సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వడ్రంగి కేసోజు నరసింహాచారి. నరసింహాచారి దాదాపు ఇరవై ఏండ్లకుపైగా సంప్రదాయ పద్ధతులతో వడ్రంగి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాను రాను కట్టె(కలప) ధరలు పెరిగి పనులు తగ్గాయి. యూపీసీ మెటీరియల్‌‌ వాడకం పెరిగింది. రెడీమేడ్ డోర్స్, కిటికీలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటి వల్ల వడ్రంగి పనులకు గిరాకీ తగ్గింది. ఇదొక్కటే కాకుండా వడ్రంగి పనుల్లో యంత్రాల వాడకం గురించి చారికి అవగాహన లేదు.

ఒకవేళ అవగాహన వచ్చినా వాటిని కొనేంత డబ్బు ఆయన దగ్గర లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కులవృత్తిని వదులుకున్నాడు. ‘‘కులవృత్తిలో ఉన్నప్పుడు నెలకు పదివేల వరకు సంపాదించేవాడ్ని.  ఇప్పుడు సిద్దిపేటలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న. కులవృత్తిలో వచ్చిన మార్పులను సకాలంలో అందుకోలేక, ఆర్థిక పరిస్థితులు బాగా లేక రోజూ కూలీ పనులకు వెళ్తూ 600 రూపాయల వరకు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నా’’ అని నరసింహాచారి చెప్పాడు. 

డ్రైవింగ్ పెట్టుకుని.. 

ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్ మండల కేంద్రానికి చెందిన మెడిచెల్మ ప్రవీణ్ నాలుగేండ్లుగా కారు డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నాడు. వృత్తిరీత్యా వడ్రంగి అయిన ప్రవీణ్​ అనుకున్నన్ని  పనులు దొరక్కపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఇదే వృత్తిని రెడీమేడ్‌‌గా చేస్తుండడంతో కులవృత్తిని మానేయాల్సి వచ్చింది. 

కొత్త పనులు 

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని గ్రామాల్లో చేతివృత్తుల మీద ఆధారపడిన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అవుసలి, చేనేత వాళ్లకు ఆదరణ లేక కొత్తపనులు వెతుక్కుంటున్నారు.తమ పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పూటగడవకపోయినా కష్టపడి ఇతర పనులు చేసి మరీ చదివించుకుంటున్నారు. కొందరైతే పుట్టిన ఊళ్లో బతుకుదెరువు కరువై పట్నాలకు కూలీ పనులకు వెళ్తున్నామని చెప్తున్నారు. నగల తయారీ యంత్రాలు వచ్చాక అవుసలి పనిచేసుకునే వాళ్లకు పనిలేకుండా పోయింది. చేనేత వస్త్రాలకు పేరెన్నికగన్న రఘుపతిపేటలో మగ్గాలు మట్టిలో కలిసిపోయాయి.  

ఐ.టి.ఐ. చదివి.. కులవృత్తి

మా తాతల కాలం నుండి మానాయన వరకు వడంగ్రి పని చేసుకుని బతికినం. కులవృత్తి మాకు కూడు పెట్టింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎడ్ల బండ్లు కనిపించకుండా పోయినయ్​. ట్రాక్టర్లు వచ్చినయ్​. నాగళ్లు అడిగే వాళ్లు లేరు. దాంతో జీవనోపాధి లేకుండా పోయింది. తలుపులు, కిటికీలు చేస్తూ కాలం ఎళ్లదీసుకుంటున్నాం. నాగళ్లు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, విత్తనపు గొర్లు, గొడ్డళ్లు అన్ని(వడ్ల, కమ్మరి) వృత్తులకు సంబంధించిన వస్తువులు తయారు చేయడం తెలుసు. కానీ.. మమ్మల్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కులవృత్తులకు ఏదైనా దారి చూపాలె. ఐ.టి.ఐ. చదివిన నేను ఊరిని నమ్ముకుని పాడైన. డిప్లొమా చేసిన నా కొడుకు పట్నం బాట పట్టిండు.

కమ్మరి భాస్కరాచారి,సింగాయిపల్లి, నాగర్‌‌కర్నూల్‌ జిల్లా

వాములు కూలిపోయినయ్‌‌

కుండలు కాల్చే వాములు కూలిపోయాయి. మూలకు పడేసినం. జడ్చర్ల, మహబూబ్​నగర్​ నుంచి తెచ్చిన కుండలు అమ్ముకుంటున్నం.

ఆనంద్​​, తిర్మలాపూర్​ , నాగర్‌‌కర్నూల్‌ జిల్లా

పదేళ్ల క్రితం వచ్చా

నేను పదేళ్ల క్రితం ఉపాధి కోసం కోల్‌‌కతా నుండి నిర్మల్ వచ్చా. ఇక్కడ ఒక నగలు తయారు చేసే యజమాని దగ్గర జీతం ఉన్నా. ఈ పనిలో నాకు ఇంతకు ముందే కొంత ఎక్స్​పీరియెన్స్​ ఉండడంతో ఆభరణాల తయారీపై పట్టు సాధించా. మారుతున్న ట్రెండ్‌‌ గమనించి నేనే సొంతంగా యూనిట్ పెట్టా. మా కోల్‌‌కతా నుండి మరి కొందరు కళాకారులను రప్పించా. వ్యాపారం సక్సెస్ అయింది. నా దగ్గర ఉన్నవాళ్లే కాకుండా మా ప్రాంతం వాళ్లు చాలామంది ఇక్కడికి వచ్చి ఆభరణాల తయారీ యూనిట్లు మొదలుపెట్టారు. మొదట్లో నేను పని చేసిన ఓనర్‌‌‌‌కే ఇప్పుడు నగలు తయారు చేసి ఇస్తున్నా.

అబ్బు బాయ్(కోల్​కతా), జువెలరి మేకింగ్ యూనిట్ నడిపే వ్యక్తి

కూలీ ఇక్కడే ఎక్కువని

దేశంలో, మన రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో వివిధ విభాగాల్లో అవసరమైన స్కిల్స్ నేర్పించే ఐటీఐలు ఉత్తర ప్రదేశ్​లో ఎక్కువ సంఖ్యలో ఉండడం కూడా ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది. దేశంలోనే అత్యధికంగా యూపీలో 3,223 ఐటీఐలు ఉండగా.. ఏటా 5.90 లక్షల మంది కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి కోర్సులు నేర్చుకుని బయటికి వస్తున్నారు.

యూపీతో పోలిస్తే తెలంగాణలో కూలీ రేట్లు డబుల్ ఉండడంతో ఎక్కువ మంది హైదరాబాద్ వస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా భవన నిర్మాణాల్లో కూలీలు మొదలు తాపీ మేస్త్రీలు, కార్పెంటర్లు, ఫాల్ సీలింగ్, కప్ బోర్డు వర్క్, ఇంటీరియర్​ డెకరేషన్, ప్లంబింగ్ లాంటి పనులన్నింటిని ఉత్తరాది కూలీలే చేస్తున్నారు. వీరిలోనూ ఉత్తరప్రదేశ్, బిహార్ లేబరే ఎక్కువమంది ఉన్నారు. అక్కడ రోజూ కూలీ రూ.500 మించకపోవడం, ఇక్కడైతే రూ. వెయ్యి నుంచి రూ.1500 వరకు వస్తుండడంతో ఏటా 9 నుంచి 10 నెలలు ఇక్కడే ఉంటున్నారు. 

మగ్గం మాని కరెంటు పనికి...

తరతరాలుగా కూడుపెట్టిన కులవృత్తికి ఇప్పుడు ఆదరణ కరువైంది. చేనేత వృత్తిని ఎన్నో ఏళ్లు నమ్ముకొని మగ్గంపై చీరలు, దోవతులు నేసిన చేతులు ఇప్పుడు కరెంటు పనిలో 33 కేవీ వైర్లు గుంజుతున్నాయి. మగ్గం నడుపుకుంటే నెలకు పదివేల రూపాయలు వస్తయ్‌. కానీ ఇప్పుడు జపాన్ మెషిన్లు రావడంతో ముగ్గురు చేసే పని కేవలం ఒక మిషన్ చేసేస్తుంది. దీంతో సేటు మాలు ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి ఏర్పడింది. అందుకే ఎండనక, వాననక కరెంటు తీగలు గుంజే పనికి పోతున్న. సున్నితమైన పనులకు అలవాటు పడి విధి లేని పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఈ పని చేయాల్సి వస్తోంది. 

గడ్డం శ్రీనివాస్ గన్నేరువరం, కరీంనగర్ జిల్లా

షాపులో మునిమ్‌‌గా.. 

ఇరవై యేండ్ల క్రితం వరకు నేను బంగారు నగలు తయారు చేసే షాపు నడిపేవాడిని. పుస్తెలు, మట్టెలు, పూసలు, నాగులు ఇతర నగలు చేతితో చేసేవాడిని. మంచి ఆదరణతో దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉండేది. హాయిగా బతుకుతున్నప్పుడు జువెలరీ మేకింగ్‌‌ రంగంలోకి మిషన్లు వచ్చి, నాకు ఉపాధి లేకుండా చేశాయి. ఇప్పుడు చాలామంది జనాలు మిషన్ కటింగ్ నగలనే ఇష్టపడుతున్నారు.

చేతులతో కొన్ని డిజైన్లు మాత్రమే చేయగలం. కానీ.. మిషన్లతో రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు. వాటికి డిమాండ్‌‌ పెరిగింది. దాంతో.. మడిగె కిరాయి, ఖర్చులు కూడా రాకపోవడంతో షాపు మూసేసి తెలిసిన వాళ్ల బంగారం షాపులో మునిమ్ పని  చేస్తున్న. పాత గిరాకీ అప్పుడప్పుడు వస్తే ఇంటిదగ్గర చేస్తున్నా. మునిమ్‌‌గా నెలకు ఎనిమిది వేలు ఇస్తున్నారు. ఖర్చులకు సరిపోవడంలేదు. 30యేండ్ల నుంచి కిరాయి ఇండ్లలోనే ఉంటున్నా. కులవృత్తి నాకు ఏరకమైన మేలు చేయలేదు.

మోత్కుల శ్రీనివాస్, బోధన్, నిజామాబాద్‌ జిల్లా 

ఊర్లో పనిలేక..

రోజు12 గంటలు పనిచేస్తే.. రోజుకు 600 రూపాయల కూలీ దొరుకుతుంది. ఊరు నుండి అచ్చంపేటకు వెళ్లి, వచ్చేందుకు రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటి ఖర్చులు పోను రోజుకు వంద రూపాయలు కూడా మిగలవు. వీటితోనే పిల్లల చదువులు, మందులు ఎల్లదీయాలె. గ్రామంలో పని దొరికితే ఈ గతి పట్టేది కాదు.

నరేంద్రాచారి, గోదల్​, నాగర్‌‌కర్నూల్‌ జిల్లా 

తగ్గిన కుండల గిరాకీ 

నలభై ఏండ్ల నుంచి  కుండలు అమ్ముకుని బతుకుతున్న. ఇంతకు ముందు రోజూ15 నుంచి 18 కుండలు అమ్మేదాన్ని. ఇప్పుడు రెండు కూడా అమ్ముడు పోతలేవు. అందరు ఫ్రిజ్​ల మీద పడ్డరు. కుండలను అడిగేటోళ్లు లేరు. 

‌‌ బొడ్డుపల్లి బాలకృష్ణమ్మఎండబెట్ల, నాగర్​ కర్నూల్ జిల్లా 

ఒకప్పుడు దర్జాగా బతికా

కొలిమి నడిచినప్పుడు దర్జాగా బతికా. పాతికేండ్లు కుల వృత్తి పని చేశా. రోజుకు కనీసం 500 నుంచి 600 రూపాయలు సంపాదించే వాడ్ని. ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకున్నా. నాట్ల సీజన్‌‌లో తినడానికి టైం కూడా ఉండేది కాదు. ఇప్పుడేమో మిషనరీలు, రెడీమేడ్‌‌ వస్తువులు మార్కెట్‌‌లోకి రావడంతో కొలిమికి పని లేకుండా పోయింది. దీంతో పనులు లేక కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. భార్య,  ముగ్గురు పిల్లలు ఉన్నారు. మిషనరీ కొని చేతి వృత్తి పని చేసుకుందామంటే.. పెట్టుబడి లేకపాయే. కుల వృత్తులను ప్రభుత్వం ఆదుకోవాలి.

  పాలగంటి శ్రీనివాసరావు, కమ్మరిచంద్రుగొండ, భద్రాద్రికొత్తగూడెం జిల్లా

కొత్తవాళ్లు రావడం లేదు 

గత ముప్పై ఏండ్ల నుంచి ఇదే రంగంలో పనిచేస్తున్నా. ఈ రంగంలోకి కొత్తవాళ్లు రావడం ఎప్పుడో బంద్ అయ్యింది. పాలిష్ పట్టే వాళ్లు, మార్బుల్స్‌‌, గ్రానైట్స్‌‌ వేసేవాళ్లు దొరక్క రాజస్తాన్, బిహార్ లేబర్​తో పని చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. నా కింద రెండు, మూడు టీమ్‌‌లు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు ఇదే పనికోసం పోటీ పడేవాళ్లు. కానీ వృత్తులను వదిలేసి చదువుపై శ్రద్ధ పెడుతున్నారు. తర్వాత వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు తప్ప ఈ ఫీల్డ్ వైపు రావడం లేదు. రాళ్లు మోయడం, ఇళ్లలో బండలు వేయడాన్ని మోటుపని అనుకుంటున్నారు. పైగా ఇది కష్టంతో కూడుకున్న పని కాబట్టి శారీరక సమస్యలు వస్తుంటాయి. అందుకే కొత్తవాళ్లు నిర్మాణ రంగంలోకి రావడంలేదు. 

- దాసరి దేవయ్యనల్గొండ పట్టణ మార్బుల్ అండ్ పోలిష్ బండల్ యూనియన్ అధ్యక్షుడు

కొడుకు లారీ డ్రైవర్​ అయ్యిండు

గ్రామాల్లో వడ్రంగి (కమ్మరి) పనులకు డిమాండ్ తగ్గింది. వ్యవసాయ పనిముట్లు చెక్కతో కాకుండా ఇనుపవి వాడుతున్నరు. కొత్త ఇండ్లకు అవసరమయ్యే తలుపులు, కిటికీలు దర్వాజాల గిరాకీలు అప్పుడప్పుడు వస్తున్నయ్​. పూట గడవటం కష్టంగా మారింది. చదువుకోవాల్సిన నా ఒక్క కొడుకు చదువు మధ్యలో ఆపేసి లారీ డ్రైవర్​గా మారిండు. ఇంటికొచ్చినప్పుడు నాకు పనిలో తోడుంటడు. దాంతోనే కుటుంబ అవసరాలు ఎళ్లదీస్తున్నం. ప్రభుత్వం మాలాంటోళ్లను గుర్తించి ఆదుకోవాలి.

- పసునూరి వెంకటేశ్వరచారిఉప్పునుంతల,  నాగర్‌‌కర్నూల్‌ జిల్లా