హనుమకొండ ఊర చెరువు ఆక్రమణలపై ఎటాక్‍... తెల్లవారుజామునే జేసీబీలతో ప్రత్యక్షమైన సిబ్బంది, పోలీసులు

హనుమకొండ ఊర చెరువు  ఆక్రమణలపై ఎటాక్‍... తెల్లవారుజామునే జేసీబీలతో ప్రత్యక్షమైన సిబ్బంది, పోలీసులు
  • గంటల్లోనే ఎర్రజెండా పార్టీల తాత్కాలిక గుడిసెల తొలగింపు
  • ఆక్రమణల్లో పూర్తిస్థాయి బిల్డింగుల జోలికి వెళ్లని ఆఫీసర్లు
  • రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు.. ఆక్రమణలపై కొరడా

వరంగల్‍, వెలుగు: గ్రేటర్ వరంగల్‍ హనుమకొండ నడిబొడ్డున ఉన్న గోపాల్‍పూర్‍ ఊర చెరువు శిఖం భూముల్లోని ఆక్రమణలపై అధికారులు కొరఢా ఝుళిపించారు. చెరువులో రోజురోజుకు పెరుగుతున్న ఆక్రమణలపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లుగానే సోమవారం తెల్లవారుజామునే ఇరిగేషన్‍, రెవెన్యూ, డీఆర్‍ఎఫ్‍, పోలీస్‍ సిబ్బంది జేసీబీలతో ప్రత్యక్షమయ్యారు. గంటల వ్యవధిలోనే ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో నిర్మించిన తాత్కాలిక గుడిసెలను తొలగించారు. కానీ ఆక్రమణల్లోని పర్మినెంట్‍ బిల్డింగుల జోలికి మాత్రం వెళ్లలేదు. 

కబ్జా చేసిన బీఆర్‍ఎస్‍ లీడర్లు

వరంగల్‍ ట్రైసిటీలో హనుమకొండ గోపాల్‍పూర్‍ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో అక్రమార్కుల కన్ను స్థానిక ఊర చెరువుపై పడింది. గతంలో దాదాపు 29 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువుపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాటి ఎమ్మెల్యేల సహకారంతో బీఆర్ఎస్‍ లీడర్లు కబ్జాలకు పాల్పడ్డారు. సర్వే నంబర్‍ 90 లోని దాదాపు 3.09 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకొని ప్లాట్లుగా అమ్మి రూ.కోట్లలో సొమ్ముచేసుకున్నారు. 

బడా లీడర్లు చెరువును కబ్జా చేయడాన్ని గమనించిన ఎర్రజెండా పార్టీల నేతలు చెరువులో గుడిసెలు వేశారు. దీంతో చెరువు శిఖం భూములు మరింత ఆక్రమణకు గురయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం వచ్చాక 2024 జనవరిలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు సిద్ధమయ్యారు. జేసీబీలతో అక్కడకు చేరుకోగా సీపీఎం లీడర్లు, మరికొందరు ఆక్రమణదారులు గుడిసెవాసులను ముందుపెట్టి ధర్నాలకు దిగడంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొలగింపులకు బ్రేక్‍ పడింది. 

స్థానికుల సహకారంతో ఆక్రమణల తొలగింపు 

మొంథా తుఫాన్‍ ప్రభావంతో హనుమకొండ సిటీ ఆగమవడంతో సీఎం రేవంత్‍రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఊర చెరువులోని ఆక్రమణలు, వ్యర్థాలను తొలగించి పూర్వవైభవం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్​బండ్‍ తరహాలో చెరువును అభివృద్ధి చేయాలని సూచించారు. ఇచ్చినమాట ప్రకారం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. రూ.4 కోట్లతో చెరువు చుట్టూరా రిటైనింగ్‍ వాల్‍ నిర్మాణం, చెరువు కట్ట వెడల్పు, ట్యాంక్​బండ్‍ తరహాలో అభివృద్ధి పనులు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం రూ.1 కోటితో చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు ఆధ్వర్యంలో చెరువు అభివృద్ధి పనులు చేపడుతూనే తాజాగా స్థానికుల సాయంతో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. 

కాలనీలను ముంచిన ఊర చెరువు, మొంథా తుఫాన్ 

గతేడాది అక్టోబర్‍ లో వరంగల్‍ సిటీపై మొంథా తుఫాన్‍ విరుచుకుపడింది. ఊర చెరువు చుట్టూరా పదుల సంఖ్యలోని కాలనీలను ముంచెత్తింది. బీరువాలు మునిగేస్థాయిలో ఇండ్లలోకి వరద చేరింది. కాగా, గోపాల్‍పూర్‍ ప్రాంతానికి పైభాగంలో ఉండే రాంపూర్‍, మడికొండ, సోమిడి, వడ్డెపల్లి చెరువుల నుంచి పెద్దెత్తున వచ్చిన వరదతో..అప్పటికే ఆక్రమణలు, వ్యర్థాలతో నిండిన ఊర చెరువు పొంగడంతో పదుల సంఖ్యలో కాలనీల్లోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.