- దేవాదుల నుంచి 38 టీఎంసీలు ఎత్తిపోస్తమని మాట తప్పిన్రు: హరీశ్‌రావు
- రామప్ప కింద తూములు మూసేశారు.. నీళ్లివ్వలేమని కలెక్టర్ చెప్పారు
- రైతులకు క్షమాపణ చెప్పి.. క్రాప్ హాలిడే ప్రకటించి డబ్బులివ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 38 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ చెప్పడంతో రైతులు నారు పోసుకున్నారని.. తీరా ఇప్పుడు నీళ్లివ్వడం లేదని మండిపడ్డారు. నీళ్లు ఉండి కూడా దేవాదుల నుంచి ఎత్తిపోయడం లేదన్నారు. 10 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తామని మంత్రులు చెప్పినా.. నిన్నటి వరకు 5 పంపులే నడిపిస్తున్నారని తెలిపారు.
మంత్రులు వెళ్లినప్పుడు ఏడు మోటార్లు, మంత్రులు లేనప్పుడు మూడు మోటార్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. దేవాదుల నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా చంద్రబాబుకు విడిచిపెడుతున్నారన్నారు. ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరంగల్ జిల్లాను కరువు కోరల్లోకి నెట్టారన్నారు.
ఎల్‌నినో అని ఆరు నెలల నుంచి నిపుణులు చెప్తున్నప్పుడు.. ప్రపంచమంతా చుక్క చుక్క నీటిని ఒడిసిపడుతుంటే ఇక్కడ మాత్రం నీళ్లను కిందకు విడిచిపెడుతున్నారని విమర్శించారు. రామప్ప కింద తూములు మూసేశారని, వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం..నాట్లు వేసకోవద్దని చెప్పారని మండిపడ్డారు. మంత్రులు మాత్రం 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారని గుర్తు చేశారు.
క్షమాపణ చెప్పాలె
రైతులకు మంత్రులు క్షమాపణలు చెప్పి.. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. క్రాప్ హాలిడే ప్రకటించి వారికి డబ్బులు ఇవ్వాలన్నారు. గ్యారెంటీల విషయంలో వాయిదాల లెక్కనే.. నీళ్ల ఎత్తిపోతల విషయంలోనూ కూడా వాయిదాలే పెడుతున్నారన్నారు.
దేవాదుల నుంచి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 50 రోజులు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేదని ప్రశ్నించారు. సమ్మక్కసాగర్ బ్యారేజీ, దేవాదుల నుంచి 105 టీఎంసీల నీళ్లు ఏపీకి వెళ్లిపోయాయన్నారు. ఎత్తిపోసిన నీళ్లు కేవలం 1.9 టీఎంసీలేనన్నారు. 12 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. ఎత్తిపోయలేదని చెప్పారు.
