సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ ఫెయిల్ : హరీశ్ రావు

సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ ఫెయిల్ : హరీశ్ రావు
  • రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎన్​సీఆర్​బీ రిపోర్ట్​ ఆందోళనకరం: హరీశ్​ రావు
  • క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలు కాపాడడంపై     దృష్టి పెట్టాలని హితవు

హైదరాబాద్, వెలుగు: సీఎంగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో 2024 నివేదిక బయటపెట్టిందని విమర్శించారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం అత్యంత ఆందోళనకరమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2023తో పోలిస్తే సైబర్​ నేరాలు 49 శాతం పెరిగాయన్నారు.

మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం.. రాష్ట్ర పోలీస్​ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు పెరగడం, మహిళలు, చిన్నారుల భద్రత క్షీణించడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. వేలాది సైబర్ నేరాల కేసులు, మిస్సింగ్ కేసులు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం దారుణమని ఆయన ఫైర్​ అయ్యారు. కరీంనగర్​లో పట్టపగలు నగల దుకాణంలో జరిగిన దోపిడీలో ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.

పట్టపగలు, ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్‌‌‌‌లో ఐపీఎస్ అధికారి భార్య హత్య వంటి ఘటనలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రలకు నిదర్శనమన్నారు. పోలీస్​ కమిషనర్​ సుమతి నిర్వహించిన ఆపరేషన్​తో హైదరాబాద్​లో మహిళల భద్రత డొల్ల అనే విషయం బయటపడిందన్నారు.  సమీక్షలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టాలని హరీశ్ రావు సూచించారు. సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, మహిళలు, చిన్నారులకు మెరుగైన భద్రత కల్పించాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.