- హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు: హరీశ్ రావు
- ఇకనైనా చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి ప్రాణాధారమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వంద కాంపోనెంట్లలో రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం బట్టబయలైందన్నారు. ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి సర్కారుకు చెంపపెట్టు అని బుధవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు, కక్షసాధింపులు మాని ఆ రెండు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించి లొంగదీసుకోవాలని చూస్తే భయపడేది లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఎన్నికల ముందు, గడచిన రెండేండ్లుగా కాంగ్రెస్ రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చింది.
ఇప్పటికే రెండున్నరేండ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. అందులో పదుల సంఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడింది. హైదరాబాద్ తో సహా 70 శాతం తెలంగాణకు తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి.
కానీ, రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. నిజానికి 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కానీ, గత రెండున్నరేండ్లుగా ల్యాండ్ అక్విజిషన్ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కేవలం కుట్రతోనే ఆపారు” అని హరీశ్ రావు ఆరోపించారు.
ఎన్డీఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని హరీశ్ అన్నారు. “ కేంద్ర మంత్రి బండి సంజయ్.. ముందు గోదావరి, బనకచర్ల లింక్ ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి. ఆంధ్రాకు ప్యాకేజీలు, ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు ఏమొస్తుందో సంజయ్ సమాధానం చెప్పాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

