- ఖమ్మం ఘటనలో నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలి: హరీశ్రావు
- బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, ఉచిత వైద్యం అందించాలి
- బాధిత బాలికకు నిమ్స్‌లో పరామర్శ
పంజాగుట్ట, వెలుగు: అత్యాచారానికి గురై ప్రాణాపాయ స్థితిలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా చిన్నారికి ఉచిత వైద్యం అందించకుండా, ఆ పేద కుటుంబాన్ని బయట మందులు కొనిపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రులు హారీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదారు పోక్సో కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు.
బాధితులకు అండగా నిలిచి, అఘాయిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిపైనే అక్రమ కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం అత్యంత దుర్మార్గమన్నారు. గురువారం నిమ్స్‌లో బాధిత బాలిక, కుటుంబాన్ని వారు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 12 ఏండ్ల చిన్నారిపై ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను ఉరితీయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని మహిళా భద్రతను గాలికొదిలేశారన్నారు. బాధిత బాలికది అత్యంత పేద కుటుంబమని, నిమ్స్ లో డాక్టర్లు మందులు బయట కొనుక్కోమని చెప్పడం ప్రభుత్వ అమానవీయ తీరుకు నిదర్శనమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబానికి కనీస పట్టింపు లేదని దుయ్యబట్టారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, బాలికకు జరగాల్సిన చేతుల సర్జరీలు వెంటనే పూర్తి చేసి, ఆమె పూర్తిగా కోలుకునే వరకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలన్నారు.
