హరీశ్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది..ప్రభుత్వాన్ని మేమెందుకు రద్దు చేస్తం: మంత్రి పొంగులేటి  

హరీశ్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది..ప్రభుత్వాన్ని మేమెందుకు రద్దు చేస్తం: మంత్రి పొంగులేటి  
  • ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడిస్తూనే ఉన్నరు..  
  • బీజేపీ పగటికలలు కంటోంది.. సీఎం, కేబినెట్ లిస్ట్ రెడీ చేసుకున్నరని ఎద్దేవా 
  • ఈ ఏడాది అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళాదామన్న మాజీ మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యలపై రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఐదేళ్లకు అధికారం ఇచ్చినపుడు మేమెందుకు ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని ఫైర్​అయ్యారు. సోమవారం సెక్రటేరియెట్ లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు ఉందని, జమిలి ఎన్నికలు జరిగితే మరో 6 నెలలు ఎక్కువ టైమ్ ఉంటుందన్నారు.

ప్రతి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడిస్తున్నా ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీశ్​రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని విమర్శించారు. కేటీఆర్ ఆవేశం, ఆక్రోశంతో ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారని.. ఏ వ్యక్తిమీదా కక్షపూరిత చర్యలు తీసుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఇక అధికారంలోకి వస్తామని బీజేపీ పగటికలలు కంటోందని, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌‌‌‌లో కనీసం డిపాజిట్ రాని పార్టీ సీఎం, క్యాబినెట్ లిస్ట్ కూడా రెడీ చేసుకుందని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర విమర్శలకు ప్రతిసారీ స్పందించనని, ఎప్పుడో ఒకసారి కచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. కేటీఆర్‌‌‌‌ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలినట్టు కాదని, ప్రజలు ఛీ కొట్టినా బాంబులు పడ్డట్టేనన్నారు. కాళేశ్వరం, థర్మల్ పవర్ ప్లాంట్ అక్రమాలపై సీబీఐ విచారణకు బీజేపీ స్పందించడం లేదన్నారు. కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

అన్ని ఎకరాలకు రైతు భరోసా

రైతు భరోసా నిధులను ఈ ఏడాది అనుకున్న దానికంటే రెండు మూడు రోజుల ముందే రైతుల అకౌంట్లలో జమ చేస్తామని, అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటివరకు 18 నియోజకవర్గాలలో 23 స్థలాలను గుర్తించామని, వచ్చే వారం నోటిఫికేషన్ ఇస్తామన్నారు.  ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి వెయ్యి ఇళ్ల చొప్పున 20 వేల ఇళ్లను నిర్మిస్తామన్నారు.

కొత్త రెవెన్యూ డివిజన్లపై నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే డిసిషన్ ఉంటుందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తమకు ఎందుకు కోపం ఉంటుందని, ఉంటే బీఆర్ ఎస్ నేతలకే ఉంటుందన్నారు. తమది కక్ష పూరిత ప్రభుత్వం కాదని, కక్ష పూరిత రాజకీయాలు చేయమన్నారు. భూముల ధరల పొరపాట్లు ఉంటే సరిచేస్తామన్నారు. ఒకే వ్యక్తి 10 స్లాట్స్ బుక్ చేసి ఇబ్బంది పెడుతుంటే వారిని బ్లాక్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ ప్రభుత్వం పూర్తి అయ్యే వరకు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, క్యాబినెట్‌‌‌‌లో నంబర్ 2 అంటే డిప్యూటీ సీఎం మాత్రమేనని పొంగులేటి స్పష్టం చేశారు