మా మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్​బ్లాంక్: హరీష్రావు

మా మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్​బ్లాంక్: హరీష్రావు
  • కాంగ్రెస్ గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ: హరీశ్​రావు
  • బీఆర్ఎస్​లో చేరిన గద్వాల డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ​మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్​బ్లాంక్ అయ్యిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్​లో జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పటేల్​ ప్రభాకర్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. ఆయనకు హరీశ్​రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్​పార్టీకి ఎన్నికల్లో నిలబెడుదామంటే అభ్యర్థులే దొరకని పరిస్థితిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు, రైతుబంధు, ఉచిత కరెంట్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్​పార్టీ గ్యారంటీల పేరుతో మోసం చేయాలని చూస్తోందన్నారు.

 ఆ పార్టీ ఇచ్చిన గ్యారంటీల అమలుకు ఎవరు గ్యారంటీ అని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్​మేనిఫెస్టో అమలుకు సీఎం కేసీఆర్ గ్యారంటీ అని, గత తొమ్మిదిన్నరేళ్లుగా మేనిఫెస్టోలో చెప్పనివెన్నో అమలు చేశారని, అందుకు మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్​పార్టీ అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల, ప్రచారంలో ఎట్లా ముందున్నదో ఎన్నికల్లో విజయం సాధించడంలోనూ ముందుంటుందన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలోని అన్ని సీట్లలో బీఆర్ఎస్​ గెలుస్తుందని, గద్వాలలో మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అన్నారు. గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డిని మళ్లీ గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. 

పటేల్​ ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్​పార్టీలో నాయకత్వ లేమి, డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతిని సహించలేక బీఆర్ఎస్​లో చేరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్​పార్టీయేనన్నారు. జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఉమాదేవి, ఎంఐఎం కౌన్సిలర్​బండి ప్రియాంక, గద్వాల ఎంఐఎం అధ్యక్షుడు సుదర్శన్, కాంగ్రెస్​పార్టీ మండల శాఖల అధ్యక్షులు రాఘు నాయుడు, శ్రీకాంత్​గౌడ్​, విశ్వనాథ్​రెడ్డి, డీసీసీ జనరల్​సెక్రటరీ విజయ్ కుమార్, వైస్​ ప్రెసిడెంట్లు పూల కరుణాకర్, అలెగ్జాండర్​ తదితరులు బీఆర్ఎస్​లో చేరారు.