V6 News

 రేవంత్‌‌‌‌ రెడ్డికి రైతుల కష్టాలు కనిపిస్తలేవు :  మాజీమంత్రి హరీశ్‌‌‌‌ రావు

 రేవంత్‌‌‌‌ రెడ్డికి రైతుల కష్టాలు కనిపిస్తలేవు :  మాజీమంత్రి హరీశ్‌‌‌‌ రావు
  • ఢిల్లీకి కప్పం కట్టడం..కేరళ ప్రచారంలో సీఎం బిజీ : మాజీమంత్రి హరీశ్‌‌‌‌రావు

సదాశివపేట, వెలుగు : ‘రైతుల కష్టాలను గాలికొదిలేసి సీఎం, మంత్రులు గాలిమోటార్లలో తిరుగుతున్నరు, ఢిల్లీకి కప్పం కట్టడం.. కేరళలో ప్రచారం చేయడంలో రేవంత్‌‌‌‌రెడ్డి బిజీబిజీగా ఉన్నడు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. కేరళలో అన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నరు’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌రావు మాట్లాడుతూ... కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపి రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, దళారులకు అమ్ముకుంటుండడంతో శనగ రైతులు ఎకరానికి రూ. 10 వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం భూములు, కమీషన్లు, కాంట్రాక్టర్ల మీద రివ్యూలు చేస్తున్నారే తప్ప రైతు సమస్యల మీద చేయడం లేదన్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన కొనసాగుతోందని, రేవంత్‌‌‌‌రెడ్డికి ప్రజల కష్టాలు కనిపిస్తలేవని, ప్రజాపాలన అని ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు పని కొచ్చిందేమీలేదన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌‌‌‌రావు పాల్గొన్నారు.