
- గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిందే కాంగ్రెస్: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్ని వర్గాలపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలను నిషేధిస్తూ మెమో ఇచ్చారని, ఇప్పుడు లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు పెడుతున్నారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారంటీని మరిచి కాంగ్రెస్ మళ్లీ ఎమర్జెన్సీ రోజులను తెచ్చిందన్నారు.
గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. కానీ, ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయమంతా లైబ్రరీల చుట్టే తిరిగిందని, రాహుల్‌గాంధీని లైబ్రరీకి తీసుకొచ్చి బూటకపు హామీలు ఇచ్చిన విషయం మరచిపోయారా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తు వచ్చాయా? అని నిలదీశారు.
గ్రంథాలయాల్లో పోలీసు లాఠీచార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని రాహుల్‌గాంధీని విద్యార్థులు నిలదీసినందుకు, ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా? అని ఫైర్అయ్యారు. ఒక్క విద్యార్థులే కాకుండా.. యావత్ తెలంగాణ కాంగ్రెస్ మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని, తెలంగాణ సమాజం మొత్తమ్మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అని హరీశ్ప్రశ్నించారు.