- తేజస్వి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని, అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ హైకమాండ్వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించాలని, లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారన్నారు. తెలంగాణ ఏర్పాటు.. ఇండియా, పాకిస్తాన్ విభజన లాంటిదే అయితే నాడు విభజన బిల్లుకు బీజేపీ ఎందుకు మద్దతు తెలిపిందని నిలదీశారు.
ప్రధాని మోదీ గతంలో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మారని గుర్తు చేశారు. తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతేమిటో తేల్చేవారన్నారు. తెలంగాణ చరిత్రను అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదని హరీశ్ హెచ్చరించారు.

