- ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
- తరుగు పేరుతో అగ్గువకే కొంటున్న వ్యాపారులు
- అకాల వర్షాల భయంతో అమ్ముకుంటున్న అన్నదాతలు
- మొక్కజొన్న రైతులదీ అదే పరిస్థితి
- ఇప్పటి వరకు 11 కేంద్రాలే ప్రారంభం
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు వారాల నుంచే కోతలు మొదలైనా, ఇంకా ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కాకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకే పంటను అమ్ముకుంటున్నారు. ఒకవైపు ముమ్మరంగా యాసంగి వరికోతలు జరుగుతుండగా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
ముందుగా నాట్లు వేసిన సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలా వరకు కోతలు జరుగుతున్నాయి. అకాల వర్షాలు, ఈదురుగాలుల భయంతో మిషన్లతోటి పొలాలు కోయిస్తున్న రైతులు, పచ్చి వడ్లనే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో దాదాపు మూడు వారాల నుంచి కోతలు జరుగుతున్నా, ఇప్పటి వరకు కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో తప్పించి మరెక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.
జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ సీజన్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 331 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 15 వేల ఎకరాల్లో కోసిన ధాన్యాన్ని రైతులు అమ్ముకున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
వ్యాపారి చెప్పిందే రేటు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.2,389 వరకు రేటు చెల్లిస్తారు. కానీ, ప్రైవేట్ వ్యాపారులు రెండు వారాల కింద క్వింటా రూ.1,900 వరకు పచ్చి వడ్లను కొనుగోలు చేయగా, ప్రస్తుతం రూ.1,700కు తగ్గించేశారు. ప్రైవేట్ వ్యాపారులు 77 కేజీల బస్తాను తూకం వేసి, 75 కేజీలు నికరంగా లెక్కిస్తారు. ఈ బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,430 వరకు రెండు వారాల కింద రేటు ఉండగా, ఇప్పుడు బాగా తగ్గించి కేవలం రూ.1,280కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడం ఒకవైపు, అకాల వర్షాల భయం మరోవైపు కలిపి తప్పనిసరిగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇంకోవైపు మొక్కజొన్న సాగు చేసిన రైతులది కూడా ఇదే పరిస్థితి. మూడు వారాలుగా మొక్కజొన్న పంట చేతికి రాగా, ఇప్పటి వరకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 11 కొనుగోలు కేంద్రాలే ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. మక్కలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.2,400 కాగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.1,700 లోపు రేటుకే కొనుగోలు చేస్తున్నారు. అయినా దూరభారంగా మారిన కేంద్రాలకు మక్కలను తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చులు భరించలేక ప్రైవేట్ కు మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో త్వరగా వడ్లు, మొక్కజొన్నలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు.
