హర్యానా అలర్లు : హైకోర్టు ఆదేశాలతో బుల్డోజర్ల యాక్షన్ కు బ్రేక్

హర్యానా అలర్లు : హైకోర్టు ఆదేశాలతో బుల్డోజర్ల యాక్షన్ కు బ్రేక్

చండీగఢ్‌ : హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల యాక్షన్‌కు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్‌ హైకోర్టులు సోమవారం (ఆగస్టు 7న)  ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్డోజర్లతో భవనాల కూల్చివేత చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 

హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్డోజర్ల యాక్షన్‌లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయించింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని హర్యానా ప్రభుత్వం చెబుతోంది. 

నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం (ఆగస్టు 6న) బుల్డోజర్‌లతో కూల్చివేశారు. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ హోటల్‌‌ యజమాని జంషెద్‌‌ మాత్రం అల్లర్లతో తన హోటల్‌‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడు. అల్లరి మూకలు వాడినట్లు చెబుతున్న హోటల్‌‌ మరో ప్రాంతంలో ఉందని అంటున్నాడు. కూల్చివేసిన కొన్ని దుకాణాలు, ఇండ్లు ఇటీవల జరిగిన హింసలో పాల్గొన్న వారివేనని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే నాలుగు  రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియలో సుమారు 5 వేల -60 ఇండ్లను కూల్చివేశారు. సంఘటనా స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు 12 దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. 

విశ్వహిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2 వేల 500 మంది భయంతో స్థానిక దేవాలయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్ధం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది.