- సీఎంగా మళ్లీ ఖట్టరే
- మధ్యాహ్నం 2:15 గంటలకు ముహూర్తం
చండీగఢ్:హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా జననాయక్ జనతాపార్టీ (జేజేపీ) నాయకుడు దుష్యంత్ చౌతాలా పదవీబాధ్యతలు చేపడతారు. ‘‘ హర్యానాలో సర్కార్ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉందన్న మా ప్రపోజల్‌ను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ అంగీకరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని గవర్నర్ మమ్మల్ని ఆహ్వానించారు.
రాజ్‌భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా ప్రమాణ స్వీకారం చేస్తారు’’ అని గవర్నర్‌ను కలిసిన తర్వాత ఖట్టర్ శనివారం మీడియాకు తెలిపారు. 90 సీట్లున్న అసెంబ్లీలో దుష్యంత్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈసారి 40 సీట్లకే పరిమితమైన బీజేపీ.. అధికారం ఏర్పాటు చేయడానికి జేజేపీతో చేతులు కలిపింది. రెండుపార్టీల మధ్య బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఏడుగురు ఇండిపెండెంట్లు కూడా బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
మంచిపాలన అందిస్తాం: కేంద్ర మంత్రి రవిశంకర్
ఖట్టర్‌తోపాటు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా గవర్నర్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… జేజేపీ, ఇండిపెండెంట్ల సాయంతో మంచిపాలన అందిస్తామని అన్నారు. కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే గోపాల్ కందా సపోర్ట్ తీసుకోబోమని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు. ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడైన గోపాల్ కందా.. బీజేపీకి సపోర్ట్ చేస్తానని ప్రకటించడంతో సొంతపార్టీలో, ప్రతిపక్షాల నుంచీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీజేపీ సీనియర్ లీడర్ ఉమాభారతి కూడా ఆయన మద్దతు తీసుకోవద్దంటూ పార్టీని కోరారు. దుష్యంత్ పార్టీ సపోర్ట్‌తో బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించడంతో కందా వివాదానికి తెరపడింది. బీజేపీ నుంచి సీఎం, జేజేపీ నుంచి డిప్యూటీ సీఎం ఉంటారని ఖట్టర్, దుష్యంత్ సమక్షంలోనే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. హర్యానాలో సుస్థిరమైన సర్కార్ ఏర్పాటు చేయడం కోసమే బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు దుష్యంత్ చౌతాలా ప్రకటించారు.
ఎన్నిక ఏకగ్రీవం
బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మీటింగ్‌కు కేంద్ర పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్‌తోపాటు, బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ హాజరయ్యారు. ఖట్టర్ పేరును ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్ ప్రపోజ్ చేయగా.. మిగతా ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు.
